
అర్హులకు పొగ.. తమ్ముళ్లకు ‘దీపం’!
విజయవాడ సిటీ : ‘దీపం’ ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు. అర్హులకు పొగబెట్టి తమ అనుచరులకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా తమ పార్టీ కార్యకర్తలకు మంజూరు చేసిన కనెక్షన్లును రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కిరణ్ సర్కారు ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది.
వాటిలో కృష్ణాజిల్లాకు 68,017 కనెక్షన్లు మంజూరయ్యాయి. కాంగ్రెస్ నాయకులు చమురు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా 46,814 మంది తమ అనుచరులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో 21,203 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కనెక్షన్లను రద్దు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. త్వరలోనే కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకే పాత జాబితాను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు వచ్చే నెలలో కొత్త జాబితాలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియక గతంలో మంజూరైన వేలాది మంది లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్ల కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై నిరసన
ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు దీపం కనెక్షన్లు కట్టబెట్టేందుకు తమకు పొగబెట్టిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత కొద్ది నెలలుగా కనెక్షన్ల కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే దీపం పథకంపై రాజకీయ జోక్యం తగదని పలువురు పేర్కొంటున్నారు.
చమురు కంపెనీలకు రూ.కోట్లలో బకాయిలు
దీపం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలకు కోట్లాది రుపాయలు బకాయి ఉన్నట్లు సమాచారం. దీపం పథకం కింద కనెక్షన్ పొందిన వారు రూ.600 చొప్పున చెల్లించాలి. ప్రభుత్వం రూ.1,600 చొప్పున జమచేయాల్సి ఉంటుంది. గత ఆరు నెలలుగా ప్రభుత్వం చమురు కంపెనీలకు దీపం బకాయిలు చెల్లించటం లేదని తెలిసింది. దీంతో చమురు కంపెనీలు కూడా దీపం కనెక్షన్లు మంజూరుకు వెనకాడుతున్నట్లు సమాచారం.