రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల ఆవేదన
తిరుపతి కల్చరల్: ఉమ్మడి రాష్ట్రంలోను, విభజన తర్వాత రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన సీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీసేలా తెలంగాణ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై రాజకీయ పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనాథగా మారిన రాయలసీమ సమస్యలపై తిరుపతి విశ్వం పాఠశాలలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుందన్నారు.
కృష్ణ జలాల్లో రాయలసీమకు హక్కులేదని తెలంగాణ సీఎం బహిరంగంగా మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గానీ, రాజకీయ పార్టీలు గానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కారణంగా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు లేకుండా పోయే ప్రమాదముందన్నారు. అనంతరం సామాజిక కార్యకర్త ఎం.పురుషోత్తంరెడ్డి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ మాట్లాడుతూ ఒక ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక వికాసం నీటితోనే ముడిపడి ఉందన్నారు. అనంతరం రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్ కె.శ్రీనివాసులురెడ్డి తదితరులు ప్రసంగించారు. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ నాయకుడు జయచంద్రారెడ్డి, సామాజిక కార్యకర్త లక్ష్మయ్య, జర్నలిస్టు పి.లోకేశ్వర్‌రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
రాయలసీమకు తీరని అన్యాయం
Published Mon, Jul 13 2015 4:02 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement