రొయ్యల చెరువులను ధ్వంసం చేయండి
‘ఆక్వా’పై సీపీఎం ప్రచారోద్యమం: సీపీఎం నేత మధు
సాక్షి, అమరావతి: పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన రొయ్యలు, చేపల చెరువులను ధ్వంసం చేయాలని సీపీఎం పిలుపిచ్చింది. ఆక్వా సాగుతో ముంచుకొస్తున్న ముప్పును ప్రజలకు వివరించేందుకు త్వరలో 10 రోజుల పాటు ప్రచారోద్యమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగవుతున్న చేపలు, రొయ్యల చెరువులపై చర్యలు తీసుకోకుంటే సీఎం చంద్రబాబుపై క్రిమినల్ కేసు వేస్తామని హెచ్చరించింది.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 22 దేశాలు రొయ్యల సాగును నిషేధిస్తే చంద్రబాబు మాత్రం ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా సాగు వల్ల మంచినీటి కొరత, కాలుష్యం, నివసించలేనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. అలాగే కోనసీమలో కొబ్బరి తోటలు, పాడి పరిశ్రమ, వరి సాగు నిర్వీర్యమవుతున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా సీఎం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.