గ్రామాలు గల్లంతే ! | Destroying villages | Sakshi
Sakshi News home page

గ్రామాలు గల్లంతే !

Published Mon, Apr 20 2015 4:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Destroying villages

రాజధాని ప్రాంతంలో పల్లెల మనుగడకు ప్రమాదం
అవి ఉంటే మురికివాడలుగా కనిపిస్తాయని పాలకుల భావన
ఎత్తు పెంపు ప్రణాళికల మాటున ఇక్కడినుంచి ఎత్తివేసే ఎత్తుగడ

 
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రతిపాదిత రాజధానిలో పల్లెలు గల్లంతుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు, మంత్రుల ప్రకటనలు ఇందుకు అనుగుణంగానే ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. సీడ్ కేపిటల్ (తొలిదశ) నిర్మాణాలకు నాలుగు గ్రామాల ఎంపిక, విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల ఏర్పాటుకు భారీ ప్రణాళికలు, ముంపు ప్రమాదం లేకుండా సముద్ర మట్టానికి అనుగుణంగా గ్రామాల ఎత్తు పెంపు వంటి ఆలోచనలు పల్లెల ఎత్తివేతకేనంటున్నారు.

వారందరికీ బహుళ అంతస్తుల భవనాల్లో నివాసం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న నవ్యాంధ్ర రాజధానిలోనే పల్లెలు కొనసాగితే అవన్నీ మురికివాడలుగా కనిపించే అవకాశం ఉంది. ఇదే అభిప్రాయంలో ప్రభుత్వం ఉండటంతో వీటిని తొలగించే అవకాశాలే ఎక్కువంటున్నారు.  మొదటి నుంచి రాజధానిలోని 29 గ్రామాలను తొలగించేది లేదని, అవన్నీ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు, మంత్రులు ప్రకటనలు చేస్తూ వచ్చారు.

దీనికి విరుద్ధంగా తొలిగా సీడ్ క్యాపిటల్‌కు నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. భూ సమీకరణకు మొదటి నుంచి సానుకూలంగా స్పందించిన ఈ గ్రామాల్లోనే రాజధానికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణాలు చేపట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఈ గ్రామాలు కనుమరుగుకాక తప్పదు.

విశాలమైన రోడ్లకు ప్రణాళిక
రాజధానికి విశాలమైన రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యాలు, ముంపు బెడద నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం రహదారుల వెడల్పు 20 అడుగులకు మించి లేదు. నవ్యాంధ్ర రాజధానికి నాలుగు సమాంతర రహదారుల నిర్మాణాలకు అంచనాలు రూపొందుతున్నాయి. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు ఇప్పటికే రాజధాని వరకు రవాణా సౌకర్యం మెరుగుకు 100 అడుగుల నిడివి కలిగిన రహదారుల విస్తరణకు అంచనాలు రూపొందించాయి. వీటికి అనుగుణంగా రహదారుల విస్తరణ జరిపితే అనేక భవనాలను నేలకూల్చక తప్పదు.

గ్రామాల స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణం?
కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు సముద్ర మట్టానికి అనుగుణంగా రాజధాని గ్రామాల ఎత్తు పెంచుతామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో ఈ గ్రామాలను పూర్తిగా ఎత్తివేసి, అక్కడ నిర్మించనున్న బహుళ అంతస్తుల్లో వారికి నివాసం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జోన్ల వారీగా అభివృద్ధి జరుగుతుందని, గ్రామ కంఠాల పరిధి పెరగదనే ప్రకటనలతో రాజధాని గ్రామాల ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది.

పొంతనలేని ప్రకటనలకు రాజధాని గ్రామాల ప్రజలు కలత చెందుతున్నారు. పాలకుల మైండ్ గేమ్‌కు తట్టుకోలేక ఏదో ఒక రోజు రాజధాని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా అక్కడి నుంచి తరలివెళ్లే అవకాశాలు లేకపోలేదు. వీటికితోడు సీఆర్‌డీఏ ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో పారిశ్రామిక, నివాస ప్రాంతాలు, రోడ్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. రాజధాని నగరం 212 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది.

ఈ పరిధిలో నిర్మాణాలకుతోడు మురుగునీరు, వరదనీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. వీటిల్లో అనేక ప్రాజెక్టులు రాజధాని గ్రామాల నుంచి కొనసాగుతాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే రాజధాని గ్రామాల్లోని అనేక నివాసాలను తీసివేయాల్సి ఉంటుంది. కొన్నింటిని తొలగించి, మరి కొన్నింటిని కొనసాగించే కంటే మొత్తం గ్రామాలనే తొలగించాలని, లేకుంటే అవన్నీ మురికి వాడలుగా కనిపిస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

ఒక సమయంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ రాజధాని నిర్మాణం జరిగితే ఆ పరిసరాల్లోని రాజధాని గ్రామాలు మురికివాడలుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వ చర్యలు ఉండటంతో రాజధాని గ్రామాల మనుగడపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement