సోమవారం రాజమండ్రిలో అమరావతి సీడ్ కేపిటల్ ప్రణాళికను సీఎం చంద్రబాబుకు అందిస్తున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్
స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలు కోరాం
* మాస్టర్‌ప్లాన్లపై త్వరలో కార్యాచరణ
* ఈశ్వరన్‌తో కలసి వెల్లడించిన సీఎం చంద్రబాబు
* సీడ్ కేపిటల్ ప్రణాళికను సమర్పించిన సింగపూర్ బృందం
రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు సింగపూర్ ప్రభుత్వాన్ని స్విస్ చాలెంజ్ విధానం కింద ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
దీర్ఘకాలిక భాగస్వామ్యం కొనసాగేలా ప్రతిపాదనలు ఉండాలని చెప్పినట్లు తెలిపారు. ఇక్కడితో ఆగిపోతే ఇదంతా కాగితాలకే పరిమితమవుతుందని, అందుకే వారిని నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు. సోమవారం రాజమండ్రిలోని ఒక హోటల్‌లో సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ అమరావతి సీడ్ కేపిటల్ ప్రణాళికను ముఖ్యమంత్రికి అందించారు.
దీనిపై ఐదుగంటలపాటు సింగపూర్ బృందంతో చర్చించిన తర్వాత సీఎం ఈశ్వరన్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రధాన భాగస్వామిగా ఉన్నా జపాన్‌ను పెట్టుబడులు పెట్టాలని కోరామని, ప్రపంచ స్థాయి కంపెనీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సింగపూర్ ఇచ్చిన మూడు ప్రణాళికలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామన్నారు. నిర్దిష్ట సమయంలో సింగపూర్ రాజధాని రీజియన్, రాజధాని నగరం, సీడ్ రాజధాని ప్రణాళికలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఒక్కపైసా అడక్కుండా సింగపూర్ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిందన్నారు.
2018 నాటికి తొలి దశ..
7,420 చదరపు కి.మీ. రాజధాని ప్రాంతంలో 40 లక్షల జనాభా, 1.8 మిలియన్ ఉద్యోగాలు, 217 చదరపు కి.మీ. రాజధాని నగరంలో 18 లక్షల ఉద్యోగాలు, 16.9 చదరపు కి.మీ. సీడ్ కేపిటల్‌లో మూడు లక్షల జనాభా 7 లక్షల ఉద్యోగాలుండేలా ప్రణాళిక రూపొందిందని తెలిపారు. 2018 నాటికి తొలి దశగా సీడ్ కేపిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు వరకూ విస్తరణ..: అమరావతి రాజధాని నగరంలో విజయవాడ, గుంటూరు, తెనాలి కలుస్తాయని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఏలూరు వరకూ విస్తరిస్తామన్నారు. భూసమీకరణ కింద 25 వేల ఎకరాలు తీసుకున్నామని, మిగిలిన భూములను ఇలాగే తీసుకోవాలని చూస్తున్నామని, కుదరకపోతే భూసేకరణకు వెళతామని చెప్పారు.
భాగస్వామ్యానికి ప్రతిపాదనలిస్తాం: ఈశ్వరన్
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ సీడ్ కేపిటల్ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలు ఇస్తామని తెలిపారు. ఇందుకు తమ ప్రభుత్వ కంపెనీలను ఎంపిక చేస్తామన్నారు. ప్రతిపాదనలు దీర్ఘకాలికంగా ఉండేలా చూడాలని సీఎం కోరుతున్నారని చెప్పారు. ఆయన విజన్ ప్రకారమే ప్రణాళికలు తయారుచేశామన్నారు. ప్రపంచస్థాయి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగావకాశాలు, మౌలిక వసతులు, నివాస ప్రాంతంగా ఉండేలా రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు.
రాజధాని నిర్మాణంతోపాటు ఇక్కడి వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరిస్తామని, ఇప్పటికే తమ సంస్థ సెంటర్ ఫర్ లివబుల్ సొసైటీ కొందరికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. సీడ్ కేపిటల్ ప్రజెంటేషన్‌ను వీక్షించిన తర్వాత సీఎం, ఈశ్వరన్‌తో హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.