
కాల్‘కేటు’లపై ఉక్కుపాదం!
రౌడీషీట్లు తెరిచేందుకు పోలీసుల సమాయత్తం
వివరాలు సేకరిస్తున్న నిఘా విభాగం
విజయవాడ సిటీ : కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. కాల్‌మనీ వ్యాపారం పేరిట దందాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు రౌడీషీట్ల మంత్రం ప్రయోగిస్తున్నారు. మాజీ రౌడీషీటర్లపై వెంటనే పాత రౌడీషీట్లను పునరుద్ధరించడంతో పాటు దందాలు చేసినట్టు సమాచారం ఉన్న వారిని కొత్తగా జాబితాలో చేర్చనున్నారు. నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే పలువురి వివరాలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గన్‌మెన్లను వెంటేసుకొని వడ్డీ వ్యాపారం దందా నిర్వహిస్తున్న మాజీ రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్‌పై తిరిగి రౌడీషీటు ప్రారంభించారు.
గతంలో పలువురు మహిళలు శివకుమార్ ఆగడాలపై కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల్లోని పలుకుబడితో అప్పటికప్పుడు శివకుమార్ బయటపడ్డాడు. కాల్‌మనీ బాధితులకు పోలీసు కమిషనర్ సవాంగ్ భరోసా ఇవ్వడంతో ఓ మహిళ అతని ఆగడాలపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.