‘రక్తాన్నైనా చిందిస్తాం.. ప్రజల మాన, ప్రాణాలను రక్షిస్తా’మని ఉద్యోగంలో చేరే ముందు ప్రతి పోలీసు చేసే ప్రతిజ్ఞ ఇది. అయితే శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టాక ‘ప్రజల పాలిట జలగల్లా మారిపోతాం- వారి రక్తాన్ని పీలుస్తాం-అక్రమార్జనలో పోటీపడతాం’ అనేలా కొందరు మారిపోతున్నారు. ఇటువంటి వారు గంజాయి మొక్కలై ఖాకీ వనాన్ని కలుషితం చేస్తున్నారు.. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప : ఓబులవారిపల్లె ఎస్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన నేపథ్యంలో మరోసారి పోలీస్ శాఖ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రైల్వేకోడూరు సీఐ రమాకాంత్ తన అక్రమార్జనకు ఎస్‌ఐ జీవితంతో చెలగాటమాడటాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ‘స్టార్లు’ పెరిగేకొద్దీ యువ పోలీసులకు ఆదర్శంగా నిలవాల్సిన వారు వారి పాలిట గుదిబండగా తయారవుతున్నారు. ఓబులవారిపల్లె ఎస్‌ఐ ఉదంతాన్ని పరిశీలిస్తే.. ఆయన పాలిట సీఐ రమాకాంత్ ఇలాగే తయారయ్యారని స్పష్టమవుతోంది. ఈ ఉదంతం పోలీస్ శాఖలో నీతి, నిజాయితీ కలిగిన అధికారులు, సిబ్బందిలో మనోస్థైరాన్ని దెబ్బతీసినట్లైంది. సీఐ రమాకాంత్ తన సర్వీసు కాలమంతా వివాదాలతోనే గడిపినట్లు తెలుస్తోంది.
అసాంఘిక శక్తులతో చేతులు కలుపుతూ..
అసాంఘిక శక్తుల ఆటలు కట్టించాల్సిన కొందరు పోలీస్ అధికారులే నీతి తప్పుతున్నారు. అసాంఘిక శక్తులతో చేతులు కలిపి అక్రమార్జనకు తెరలేపుతున్నారు. ఎర్రచందనం దుంగల తరలింపు మొదలుకుని దొంగతనాలు, నకిలీ కరెన్సీ, క్రికెట్ బెట్టింగ్స్, మట్కా, జూదాన్ని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కలిగి ఉన్న కోకైన్ అక్రమ రవాణాలోనూ వారి పాత్ర కీలకంగానే ఉంటోంది.
ఇష్టారాజ్యంగా...
రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పోలీస్ బాస్‌లు ఎవరికి వారుగా వ్యవహరిస్తుండడమే దీనికంతటికీ కారణంగా తెలుస్తోంది. తాజాగా ఓబులవారిపల్లె ఎస్‌ఐ ఉదంతం కూడా ఇటువంటిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజంపేట రాయలసీమ గ్రామీణ బ్యాంకులో సుమారు రూ.1.2 కోట్లు దోపిడీ గురి కావడం సంచలనం సృష్టించింది. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. అయినా దాన్ని ఛేదించలేకపోతున్నారు. పెపైచ్చు ఖర్చులకంటూ బ్యాంక్ సిబ్బంది నుంచి ముడుపులు గుంజుతుండటం పోలీసుల దిగజారుడుతనాన్ని తెలియజేస్తోంది.
కానిస్టేబుల్ మొదలుకుని..
రాజంపేట పోలీస్ సబ్‌డివిజన్‌లో పోలీసు కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరి స్థాయిలో వారు అక్రమ సంపాదనకు అర్రులు చాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులైతే ఏకంగా జూద స్థావరాలను సైతం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నీతి, నిజాయితీగా ఉన్న వారికి మాత్రం ఛీత్కారాలు, అవమానాలు తప్పని పరిస్థితి. ఓబులవారిపల్లె ఎస్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి వివాద రహితంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించేవారని సహచర పోలీసులతో పాటు మండల ప్రజలు సైతం అంటున్నారు.
స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తున్నట్లు..
పోలీసు శాఖకు నిఘా వ్యవస్థతో పాటు, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తాజా నివేదికలను అందజేస్తూ ఉంటుంది. ఎస్పీ పరిధిలో స్పెషల్‌బ్రాంచ్ విధులు నిర్వర్తిస్తుంటుంది. సర్కిల్ పరిధిని బట్టి ఒకరిద్దరు హెడ్ కానిస్టేబుల్ స్థాయి వారు విధుల్లో ఉంటారు, వారి పని శాఖలో ఏం జరుగుతున్నదన్న విషయాన్ని గుర్తిస్తూ.. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడమే.. ఒక ఎస్‌ఐ చనిపోయేంత స్థాయిలో మానసిక వేదనకు గురి చేస్తున్న సీఐని గుర్తించలేక పోయారా? గుర్తించినా నిలువరించాల్సిన అధికారులు స్పందించలేదా? సీఐకి ఉన్నతాధికారుల వత్తాసు ఏమైనా ఉందా.. ఇవన్నీ శేష ప్రశ్నలుగానే నిలుస్తున్నాయి.
మానవత్వం లేదా..?
ఏదేని శాఖలో కింది స్థాయిలో కనీసం అటెండర్, వాచ్‌మెన్ చనిపోయినా లేక కాంట్రాక్ట్ చిరుద్యోగి చనిపోయినా ఆ శాఖలోని అధికారి మొదలుకుని సిబ్బంది అందరూ మానవత్వం చూపుతారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు.. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలుపుతారు. అయితే ఓబులవారిపల్లె ఎస్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి ఘటనలో అటువంటివేవీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక ఎస్‌ఐ.. అదీ నిజాయితీ కలిగిన యువ ఎస్‌ఐ అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. కనీసం సంతాపం తెలిపేవారే లేకపోవడం పోలీసుల కఠిన మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. ఎస్‌ఐ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. ‘మిస్‌ఫైరింగ్’ అంటూ ఎన్‌కౌంటర్‌ను పోలిన కథలాగా కట్టుకథను అల్లేయడం కూడా చర్చకు దారితీసింది. నిష్పక్షపాతంగా.. నిజాయితీగా.. విచారణ జరిపిస్తే తప్ప ఎస్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి ఘటనలో నిజాలు వెలుగుచూసే అవకాశం లేదు.
దిగజారుతున్న ప్రతిష్ట
Published Thu, Apr 10 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement