Suresh Kumar Reddy
-
బనియన్ల నిండా బంగారం, నగదే
సాకక్షి, కర్నూలు: సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,84,53,500 నగదు, 4.565 కిలోల బంగారం, 5కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్ఐలు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా, అమర్‌ప్రతాప్ పవార్(నంద్యాల), శబరి రాజన్(సేలం, తమిళనాడు), వెంకటేష్ రాహుల్(కోయంబత్తూరు), సెంథిల్‌కుమార్ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమర్‌ప్రతాప్ పవార్ నుంచి రూ.1,20,80,000, శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3.195 కిలోల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్‌కుమార్ నుంచి 1.37కిలోల బంగారం, రూ.44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. బంగారం, వెండి, నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్, వీఆర్వో గిడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్‌లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్‌తోపాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ సిబ్బందిని అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు. -
దిగజారుతున్న ప్రతిష్ట
‘రక్తాన్నైనా చిందిస్తాం.. ప్రజల మాన, ప్రాణాలను రక్షిస్తా’మని ఉద్యోగంలో చేరే ముందు ప్రతి పోలీసు చేసే ప్రతిజ్ఞ ఇది. అయితే శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టాక ‘ప్రజల పాలిట జలగల్లా మారిపోతాం- వారి రక్తాన్ని పీలుస్తాం-అక్రమార్జనలో పోటీపడతాం’ అనేలా కొందరు మారిపోతున్నారు. ఇటువంటి వారు గంజాయి మొక్కలై ఖాకీ వనాన్ని కలుషితం చేస్తున్నారు.. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప : ఓబులవారిపల్లె ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన నేపథ్యంలో మరోసారి పోలీస్ శాఖ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రైల్వేకోడూరు సీఐ రమాకాంత్ తన అక్రమార్జనకు ఎస్ఐ జీవితంతో చెలగాటమాడటాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ‘స్టార్లు’ పెరిగేకొద్దీ యువ పోలీసులకు ఆదర్శంగా నిలవాల్సిన వారు వారి పాలిట గుదిబండగా తయారవుతున్నారు. ఓబులవారిపల్లె ఎస్ఐ ఉదంతాన్ని పరిశీలిస్తే.. ఆయన పాలిట సీఐ రమాకాంత్ ఇలాగే తయారయ్యారని స్పష్టమవుతోంది. ఈ ఉదంతం పోలీస్ శాఖలో నీతి, నిజాయితీ కలిగిన అధికారులు, సిబ్బందిలో మనోస్థైరాన్ని దెబ్బతీసినట్లైంది. సీఐ రమాకాంత్ తన సర్వీసు కాలమంతా వివాదాలతోనే గడిపినట్లు తెలుస్తోంది. అసాంఘిక శక్తులతో చేతులు కలుపుతూ.. అసాంఘిక శక్తుల ఆటలు కట్టించాల్సిన కొందరు పోలీస్ అధికారులే నీతి తప్పుతున్నారు. అసాంఘిక శక్తులతో చేతులు కలిపి అక్రమార్జనకు తెరలేపుతున్నారు. ఎర్రచందనం దుంగల తరలింపు మొదలుకుని దొంగతనాలు, నకిలీ కరెన్సీ, క్రికెట్ బెట్టింగ్స్, మట్కా, జూదాన్ని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కలిగి ఉన్న కోకైన్ అక్రమ రవాణాలోనూ వారి పాత్ర కీలకంగానే ఉంటోంది. ఇష్టారాజ్యంగా... రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పోలీస్ బాస్‌లు ఎవరికి వారుగా వ్యవహరిస్తుండడమే దీనికంతటికీ కారణంగా తెలుస్తోంది. తాజాగా ఓబులవారిపల్లె ఎస్ఐ ఉదంతం కూడా ఇటువంటిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజంపేట రాయలసీమ గ్రామీణ బ్యాంకులో సుమారు రూ.1.2 కోట్లు దోపిడీ గురి కావడం సంచలనం సృష్టించింది. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. అయినా దాన్ని ఛేదించలేకపోతున్నారు. పెపైచ్చు ఖర్చులకంటూ బ్యాంక్ సిబ్బంది నుంచి ముడుపులు గుంజుతుండటం పోలీసుల దిగజారుడుతనాన్ని తెలియజేస్తోంది. కానిస్టేబుల్ మొదలుకుని.. రాజంపేట పోలీస్ సబ్‌డివిజన్‌లో పోలీసు కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరి స్థాయిలో వారు అక్రమ సంపాదనకు అర్రులు చాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులైతే ఏకంగా జూద స్థావరాలను సైతం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నీతి, నిజాయితీగా ఉన్న వారికి మాత్రం ఛీత్కారాలు, అవమానాలు తప్పని పరిస్థితి. ఓబులవారిపల్లె ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి వివాద రహితంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించేవారని సహచర పోలీసులతో పాటు మండల ప్రజలు సైతం అంటున్నారు. స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తున్నట్లు.. పోలీసు శాఖకు నిఘా వ్యవస్థతో పాటు, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తాజా నివేదికలను అందజేస్తూ ఉంటుంది. ఎస్పీ పరిధిలో స్పెషల్‌బ్రాంచ్ విధులు నిర్వర్తిస్తుంటుంది. సర్కిల్ పరిధిని బట్టి ఒకరిద్దరు హెడ్ కానిస్టేబుల్ స్థాయి వారు విధుల్లో ఉంటారు, వారి పని శాఖలో ఏం జరుగుతున్నదన్న విషయాన్ని గుర్తిస్తూ.. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడమే.. ఒక ఎస్ఐ చనిపోయేంత స్థాయిలో మానసిక వేదనకు గురి చేస్తున్న సీఐని గుర్తించలేక పోయారా? గుర్తించినా నిలువరించాల్సిన అధికారులు స్పందించలేదా? సీఐకి ఉన్నతాధికారుల వత్తాసు ఏమైనా ఉందా.. ఇవన్నీ శేష ప్రశ్నలుగానే నిలుస్తున్నాయి. మానవత్వం లేదా..? ఏదేని శాఖలో కింది స్థాయిలో కనీసం అటెండర్, వాచ్మెన్ చనిపోయినా లేక కాంట్రాక్ట్ చిరుద్యోగి చనిపోయినా ఆ శాఖలోని అధికారి మొదలుకుని సిబ్బంది అందరూ మానవత్వం చూపుతారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు.. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలుపుతారు. అయితే ఓబులవారిపల్లె ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి ఘటనలో అటువంటివేవీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక ఎస్ఐ.. అదీ నిజాయితీ కలిగిన యువ ఎస్ఐ అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. కనీసం సంతాపం తెలిపేవారే లేకపోవడం పోలీసుల కఠిన మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. ఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. ‘మిస్‌ఫైరింగ్’ అంటూ ఎన్‌కౌంటర్‌ను పోలిన కథలాగా కట్టుకథను అల్లేయడం కూడా చర్చకు దారితీసింది. నిష్పక్షపాతంగా.. నిజాయితీగా.. విచారణ జరిపిస్తే తప్ప ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి ఘటనలో నిజాలు వెలుగుచూసే అవకాశం లేదు. -
నా భర్తను సీఐ హత్య చేయించాడు
ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి సతీమణి రామలీల ఆరోపణ సీఐ సస్పెన్షన్ ఓబులవారిపల్లె, అక్రమార్జనకు సహకరించక పోవడం వల్లే సీఐ రమాకాంత్ ఇద్దరు కానిస్టేబుళ్లతో కలసి తన భర్తను హత్య చేయించారని ఓబుల వారిపల్లె ఎస్ఐ నంద్యాల సురేష్ కుమార్‌రెడ్డి(27) భార్య రామలీల ఆరోపించారు. ప్రతినెలా ముడుపులు ముట్టజెప్పాలని సీఐ కోరేవాడని, ఇందుకు ఆయన నిరాకరించడంతో వేధించేవారని ఆమె తెలిపారు. వైఎస్సార్‌జిల్లా ఓబులవారిపల్లె ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించాలనే ప్రయత్నాలను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. తన కింద పనిచేసే ఎస్ఐ మరణిస్తే కనీసం చూసేందుకు కూడా సీఐ రాలేదని, అతనే ఈ హత్య చేయించాడని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేదిలేదని అడ్డుకున్నారు. ఈ మేరకు వారు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ అశోక్‌కుమార్ మృతుడి బంధువులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన ఆదేశాల మేరకు సీఐని సస్పెండ్ చేసినట్లు చెప్పడంతో వారు శాంతించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. -
ఎస్ఐ ఆత్మహత్య: పీఎస్ ఎదుట బంధువుల ధర్నా
నిన్న సాయంత్రం రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్న ఓబులువారిపల్లె ఎస్.ఐ నంద్యాల సురేష్‌కుమార్ రెడ్డి అత్మహత్యకు రైల్వే కోడూరు సీఐ రమాకాంత్ వేధింపులే కారణమని అయన భార్య, బంధువులు ఆరోపించారు. మంగళవారం ఉదయం ఓబులువారిపల్లె పోలీసు స్టేషన్ ఎదుట సురేష్ భార్య, బంధువులు ధర్నా చేశారు. సీఐ రమాకాంత్ వచ్చి వివరణ ఇచ్చేవరకు సురేష్ మృతదేహన్ని అంగుళం కూడా కదిలించమని వారు భీష్మించుకుని కూర్చొన్నారు. ఉన్నతాధికారులు రమాకాంత్‌కు కొమ్ముకాస్తున్నారని సురేష్ కుమార్ రెడ్డి భార్య,బంధువులు ఈ సందర్బంగా ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఓబులువారిపల్లె ఎస్.ఐ. నంద్యాల సురేష్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం పోలీసు క్వార్టర్స్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆత్మహత్య
కడప: వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లి ఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్స్‌లోనే అతను రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణాలు తెలియలేదు.