నా భర్తను సీఐ హత్య చేయించాడు
ఎస్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి సతీమణి రామలీల ఆరోపణ సీఐ సస్పెన్షన్
ఓబులవారిపల్లె, అక్రమార్జనకు సహకరించక పోవడం వల్లే సీఐ రమాకాంత్ ఇద్దరు కానిస్టేబుళ్లతో కలసి తన భర్తను హత్య చేయించారని ఓబుల వారిపల్లె ఎస్‌ఐ నంద్యాల సురేష్ కుమార్‌రెడ్డి(27) భార్య రామలీల ఆరోపించారు. ప్రతినెలా ముడుపులు ముట్టజెప్పాలని సీఐ కోరేవాడని, ఇందుకు ఆయన నిరాకరించడంతో వేధించేవారని ఆమె తెలిపారు. వైఎస్సార్‌జిల్లా ఓబులవారిపల్లె ఎస్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించాలనే ప్రయత్నాలను మృతుడి బంధువులు అడ్డుకున్నారు.
తన కింద పనిచేసే ఎస్‌ఐ మరణిస్తే కనీసం చూసేందుకు కూడా సీఐ రాలేదని, అతనే ఈ హత్య చేయించాడని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేదిలేదని అడ్డుకున్నారు. ఈ మేరకు వారు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ అశోక్‌కుమార్ మృతుడి బంధువులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన ఆదేశాల మేరకు సీఐని సస్పెండ్ చేసినట్లు చెప్పడంతో వారు శాంతించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.