కర్నూలు, న్యూస్‌లైన్: జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదగాలంటే చదువుతో పాటు దృఢ సంకల్పం ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ అన్నారు. పోలీస్ కుటుంబాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం స్థానిక పోలీస్ పెరేడ్స్ గ్రౌండ్‌లో ఎస్పీ రఘురామిరెడ్డి అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీఐజీ ప్రసంగించారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసు కుటుంబాలకు చెందిన చిన్నారులు చదువులో ఇతర ఉద్యోగుల పిల్లల కంటే తక్కువేం కాదని నిరూపించినందుకు గర్వకారణంగా ఉందన్నారు.
పోలీస్ పురస్కార్ అందుకున్న పిల్లలను స్ఫూర్తిగా తీసుకుని మిగతావారు కూడా మంచి మార్కులు సాధించాలని కోరారు. జీవితంలో రాణించాలంటే చదువుతో పాటు సమాజంపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థికి క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా భాషపైన పట్టు సాధించిన విద్యార్థులు ఇంటర్వ్యూల్లో తమ ప్రతిభను కనబరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాచా నెహ్రూ పుట్టిన రోజు ఇలాంటి అవార్డుల ప్రదాన వేడుక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. పోలీసు పిల్లలు విద్యలో అభివృద్ధి చెందడానికి తండ్రుల కంటే కూడా తల్లుల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు టర్నింగ్ పాయింట్ అని.. ఉన్నత చదువుల్లో మరింత ప్రతిభ కనబరిచి జీవితంలో స్థిర పడాలని ఆకాంక్షించారు. ఎస్పీ రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ప్రతిభ పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంటుందన్నారు. ఇంటర్ తర్వాత పెద్ద చదువుల కోసం తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు ఉండాల్సి వస్తుందని, అదే సమయంలో స్నేహితుల సావాసంతో చెడు మార్గం పట్టే అవకాశం కూడా ఉందన్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు.. ఎంత జాగ్రత్తగా పెంచారు.. తనపై కుటుంబం ఎలాంటి ఆశలు పెంచుకుందనే విషయాలను నిరంతరం మనసులో పెట్టుకుని మంచి స్థాయికి ఎదిగితేనే పోలీసు శాఖకు గర్వకారణంగా ఉంటుందన్నారు. పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో పని చేస్తున్న అధికారులను ఆదర్శంగా తీసుకోవాలని అదనపు ఎస్పీ వెంకటరత్నం అన్నారు.
పదో తరగతిలో 9.3 శాతానికిపైగా మార్కులు సాధించిన 89 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్‌లో 930కి పైగా మార్కులు సాధించిన 49 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రతిభా పురస్కార్‌లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ వైవి.రమణకుమార్, ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, హోంగార్డ్స్ డీఎస్పీ క్రిష్ణమోహన్, సీఐలు శ్రీనివాసులు, బాబు ప్రసాద్, అబ్దుల్ గౌస్, కేశవరెడ్డి, వీవీ నాయుడు, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సంకల్పం ముఖ్యం
Published Fri, Nov 15 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement