
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి: సింగపూర్ సహకారంతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, అమరావతి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ ప్రభుత్వం అందించిన సహకారం మరిచిపోలేమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రగతి, రియల్‌టైం గవర్నెన్స్, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో నిర్మించనున్న వెల్‌కం గ్యాలరీకి గురువారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో విస్తారంగా వనరులు అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించుకుని అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్, పరిపాలన వ్యవహారాల్లో సింగపూర్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా నాలుగున్నరేళ్లలో కోటిన్నర ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి: ఈశ్వరన్
సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యం రాజధాని అభివృద్ధికి దోహదపడుతుందని సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్ పేర్కొన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా వెల్‌కం గ్యాలరీ నిర్మాణం జరగనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమ బంధం దృఢపడుతోందని, స్విస్ చాలెంజ్‌లో మొదటి దశ పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి తమ ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment