
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి బొత్స
సాక్షి, అమరావతి : రాజధాని వ్యవహారాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం సీఆర్‌డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాజధాని ప్రాజెక్టులు, వాటి స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, ప్రత్యేక కమిషనర్ రామ్మోహన్‌రావు సీఆర్‌డీఏ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, పనులన్నింటినీ ఆయనకు వివరించారు. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిస్థితి, నిధుల సమీకరణ, భూసమీకరణ, భూముల కేటాయింపు తదితర అన్ని విషయాలను తెలుసుకున్న ఆయన తన అనుమానాలను కూడా నివృత్తి చేసుకున్నారు.
ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి రాజధాని రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి వివరించారు. రాజధాని వ్యవహారాలను తెలుసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశానని, త్వరలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తానని, సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత ప్రభుత్వ విధానం ప్రకారం ఏం చేయాలో అది చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఉన్నదాన్ని పాడుచేసే పరిస్థితి ఉండదన్నారు. రాజధాని ఆగిపోతుందనే ప్రచారంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment