సర్కారీ బడికి.. జై | Development of Govt Schools with Rs 10000 crore In AP by Nadu Nedu | Sakshi
Sakshi News home page

సర్కారీ బడికి.. జై

Published Mon, Jun 8 2020 3:17 AM | Last Updated on Mon, Jun 8 2020 7:43 AM

Development of Govt Schools with Rs 10000 crore In AP by Nadu Nedu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రభుత్వ పాఠశాలలకు.. ప్రైవేట్‌ స్కూళ్లకు ఉన్న ప్రధాన వ్యత్యాసం మౌలిక వసతులు, ఆంగ్లంలో బోధన. ఇప్పుడిక ఆ తేడా తొలగిపోవడం, అమ్మఒడి లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక ఆసరా అందిస్తుండటంతో సర్కారీ స్కూళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏడాది వ్యవధిలోనే దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం దీనికి నిదర్శనం. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో లక్ష్యాన్ని మించి చేరికలు నమోదవుతున్నాయి. 

► ఒక దశలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోగా గతేడాది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంతో ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు భారీగా పెరిగాయి. 2020–21 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

► ప్రభుత్వ పాఠశాలల్లో రూ.పది వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతం చేయడంతోపాటు తల్లిదండ్రుల మనోగతానికి అనుగుణంగా ఇంగ్లిష్‌ మీడియం అందుబాటులోకి తెస్తుండటం ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆదరణకు ప్రధాన కారణం.

► రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సర్కార్‌ స్కూళ్లంటే చులకనగా చూసే ధృక్పథం నుంచి వాటిల్లో తమ పిల్లలను భరోసగా చదివించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా బోధన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏడాదిలోనే పలు చర్యలు చేపట్టింది. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక లాంటి పథకాల ద్వారా తోడ్పాటునందిస్తుండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను ఆదరిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే కొత్త టేబుళ్లు 

శరవేగంగా స్కూళ్ల అభివృద్ధి పనులు.. 
– రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ స్కూళ్లలో రూ.10 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ‘మనబడి నాడు–నేడు’ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తొలిదశ కింద 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు రూ.3,832 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.3,333 కోట్ల నిధులు మంజూరు చేశారు. 
– స్కూళ్లలో టాయిలెట్లు (రన్నింగ్‌ వాటర్‌తో), విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు,  మంచినీరు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నీచర్, పెయింటింగ్, బ్లాక్‌ బోర్డులు. ఇంగ్లీషు ల్యాబ్స్, ప్రహరీలు, మరమ్మతులు లాంటి 9 రకాల సదుపాయాలను కల్పిస్తారు. అవసరమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టారు.
– తొలిదశలో మొత్తం 15,715 స్కూళ్లలో 1,18,477 పనులు చేపట్టాలని అంచనా వేయగా ప్రభుత్వం ఇప్పటికే 1,18,308 పనులకు అన్ని అనుమతులు ఇవ్వడంతో శరవేగంగా కొనసాగుతున్నాయి.

36,58,553 మందికి ‘గోరుముద్ద’ 
– ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా పిల్లలకు రుచి, శుచికరమైన పౌష్టికాహారాన్ని రోజుకో రకమైన మెనూతో ప్రభుత్వం అందిస్తోంది.
– గోరుముద్ద ద్వారా రాష్ట్రంలోని 45,723 ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలోని 36,58,553 మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూరుస్తోంది. వీరిలో ప్రాథమిక స్థాయిలో 18,18,630 మంది, ప్రాథమికోన్నత స్థాయిలో 11,21,910 మంది, హైస్కూల్‌ స్థాయిలో 7,18,013 మంది విద్యార్థులున్నారు.

– గోరుముద్ద అందించేందుకు 88,296 మంది వంటపనివారి వేతనాన్ని రూ.1,000 నుంచి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది.

– గతంలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 24,29,196 మంది మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటుండగా కొత్త మెనూ అమల్లోకి వచ్చాక ఇది 29,74,010కి  పెరిగినట్లు (9 శాతం) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

– ముఖ్యమంత్రి జగన్‌ సూచనల మేరకు కొత్త మెనూను ప్రకటించి రోజూ వేర్వేరు రకాల పదార్థాలతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం అదనంగా రూ.1,048.57 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది.

మరో ‘కానుక’.. దుస్తులు, బుక్స్, బ్యాగ్, బూట్లు
– ‘జగనన్న విద్యాకానుక’ పథకం కింద 2020–21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 – 10వ తరగతి విద్యార్థులకు 3 జతల దుస్తుల వస్త్రం, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తారు. దుస్తులు  ఒక్కో జత కుట్టుకూలి కింద రూ.40 చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నారు.

– ‘జగనన్న విద్యా కానుక’ కోసం 2020–21 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం రూ.650.60 కోట్లను వెచ్చిస్తోంది.

ఇంగ్లీషు మీడియానికే తల్లిదండ్రుల ఓటు
– ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను కల్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా 2020–21 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకు అనుగుణంగా 1 – 6వ తరగతి వరకు ముందుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టి ఆపై ఏడాదుల్లో తదుపరి తరగతులకు విస్తరించేలా ఉత్తర్వులిచ్చింది. 

– బోధనా మాధ్యమంపై ముందుగా పేరెంట్స్‌ కమిటీల నుంచి అభిప్రాయ సేకరణ చేయగా ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా 94 శాతం తీర్మానాలు వచ్చాయి. 

– తదుపరి హైకోర్టు సూచన మేరకు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకున్నారు. తెలుగు మాధ్యమాన్ని 3.05 శాతం (53,943) మంది ఎంచుకున్నారు.

– రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) సిఫార్సుల మేరకు 1 –10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం (2020–21 నుంచి 1 – 6 వరకు) ప్రవేశపెట్టనున్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగిస్తారు. ఈ స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సదుపాయంతో పాటు దూర ప్రాంతాలనుంచి వచ్చే వారికి రవాణా ఖర్చుల కింద రూ.6 వేలు చెల్లిస్తారు.

– ఆంగ్ల మాధ్యమంలో బోధన, నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎస్‌సీఈఆర్టీ సమగ్ర అభ్యసన అభివృద్ధి కార్యక్రమం (సీఎల్‌ఈపీ) పేరుతో వెబ్‌నార్‌ శిక్షణ ఇచ్చింది. దీనికి 1.10 లక్షల మంది ప్రభుత్వ టీచర్లు హాజరయ్యారు. టీచర్లు, విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులను కూడా ప్రారంభించారు. 

‘అమ్మ ఒడి’తో కొండంత అండ..
– పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచడం, డబ్బులు లేని కారణంగా పేద పిల్లలు చదువుకు దూరం కారాదనే లక్ష్యంతో ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింపచేసింది.

– ప్రస్తుత విద్యాసంవత్సరంలో 42.24 లక్షల మంది పేద తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.6,336 కోట్లు అందచేశారు. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా మేలు చేకూరింది. 

– అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరిన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులున్నారు. వీరిలో 1 – 5 తరగతులు చదివే వారు 16,37,886 మంది, 6,–,10 తరగతుల విద్యార్థులు 10,55,078 మంది, ఇంటర్‌ విద్యార్థులు 2,41,800 మంది ఉన్నారు. 

– అమ్మ ఒడి పథకంతో డ్రాపవుట్ల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు పాఠశాలల్లో పిల్లల చేరికలు గణనీయంగా పెరిగాయి. 2019–20లో 70,41,988 మంది విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించగా అది 72,29,596కి పెరగడం విశేషం. వీరిలో అత్యధికులు ప్రభుత్వ స్కూళ్లలో చేరిన వారే ఉన్నారు. 

ఏడాదిలో 2.50 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలోకి...
– గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్‌ స్కూళ్లలో చేరే వారి సంఖ్య అధికంగా ఉండగా ఇప్పుడు అది తారుమారైంది. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తూ చేపట్టిన చర్యల వల్ల ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి 2.50 లక్షల మంది విద్యార్థులు వచ్చి చేరడం గమనార్హం. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, వివిధ పథకాల వల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

– ఇవేకాకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రమాణాల పెంపు, నియంత్రణకు వీలుగా ప్రభుత్వం శాసనసభలో ప్రత్యేక చట్టం చేసి పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతో పాటు సదుపాయాలు, ఇతర అంశాలను పర్యవేక్షిస్తూ నియంత్రిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement