సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అంతకంటే జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. సామాన్య, పేద రోగులకు సర్కారీ ఆస్పత్రులే ఆధారం. ఆంధ్రప్రదేశ్‌లో ద్వితీయ శ్రేణి ఆస్పత్రులు ఏటా లక్షలాది మందికి ఊరటనిస్తున్నాయి. అలాంటివి గత సర్కారు పాలనలో నిధులివ్వక, నియామకాలు లేక, పట్టించుకునే నాథుడు లేక దిక్కూమొక్కూ లేనివిగా మారాయి. ఇక ఎంతోమంది పేద గర్భిణులకు సాంత్వన చేకూర్చే సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ) పరిస్థితి దయనీయం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో సీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కళకళలాడుతున్నాయి. వానొస్తే ఇక నీరుగారే భవనాలు లేవు. వైద్యుల నియామకాలు, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు ధైర్యంగా వెళుతున్నారు. సెకండరీ కేర్ ఆస్పత్రులుగా పేరున్న వైద్య విధానపరిషత్ విభాగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్య విధాన పరిషత్‌లోని 169 ఆస్పత్రులను నాడు–నేడులో భాగంగా రూ.1,236 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
పేద రోగులకు ఊరట..
‘సామాజిక ఆరోగ్య కేంద్రాలకు మంచిరోజులొచ్చాయి. ఏడాదిలోగా అన్ని సీహెచ్‌సీలు కొత్త హంగులతో సేవలందిస్తాయి. వీటి పునరుద్ధరణ లక్షలాది మంది పేద రోగులకు ఊరటనిస్తుంది. వచ్చే నాలుగేళ్లలో ఆస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాం. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్‌బీ వైద్య సీట్లు వచ్చేలా చర్యలు చేపట్టాం’
–డాక్టర్ రామకృష్ణారావు (వైద్య విధాన పరిషత్ కమిషనర్)
రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే లక్షల మంది చిన్నారులకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంతో మేలు జరిగింది. ఇప్పటివరకూ 68 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి. నాలుగేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రూ.560 కోట్లు కేటాయించారు. ఇందులో ఎన్‌హెచ్‌ఎం నుంచి రూ.220 కోట్లు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.340 కోట్లు ఇస్తోంది. కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ప్రభుత్వమే ఉచితంగా కళ్లద్దాలు అందచేసింది. ఈ కార్యక్రమం మొత్తం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఏరియా ఆస్పత్రుల్లోనే జరిగింది.
70 ఆస్పత్రుల్లో నలుగురు చొప్పున గైనకాలజిస్ట్‌లు
రాష్ట్రంలో 192 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా పేదలు ఎక్కువగా ఈ ఆస్పత్రుల్లోకే ప్రసవానికి వస్తుంటారు. అయితే 70 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సామర్థ్యానికి మించి కాన్పులు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి ఏకంగా నలుగురు చొప్పున గైనకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యులు ఎలాగూ ఉంటారు. ఈ 70 ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు, పడకలు పెంచి మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు 24 సీహెచ్‌సీలను ఉన్నతీకరించి ఏరియా ఆస్పత్రులుగా మారుస్తున్నారు. ఉన్నతీకరించే ఆస్పత్రుల్లో పడకలను రెట్టింపు చేస్తారు.
దివ్యాంగుల సర్టిఫికెట్లలో కొత్త ఒరవడి
వివిధ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు సర్టిఫికెట్లు పొందాలంటే గతంలో నెలల తరబడి వేచి చూసేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచి వైద్యులను నియమించడంతో రెట్టింపు సంఖ్యకు పైగా సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి.
రూ.1,236 కోట్లతో నాడు–నేడు పనులు
వైద్య విధాన పరిషత్‌లోని 169 ఆస్పత్రులను నాడు–నేడులో భాగంగా రూ.1,236 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 123 సామాజిక ఆరోగ్యకేంద్రాలు, 46 ఏరియా ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి రూ.695 కోట్లు, సీహెచ్‌సీల అభివృద్ధికి రూ.541 కోట్లు వ్యయం చేస్తారు. నిర్మాణ పనుల నుంచి వైద్య పరికరాల వరకూ అన్ని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ప్రధానంగా తల్లీ బిడ్డల వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఆగస్టు చివరికల్లా వైద్య సిబ్బంది నియామకాలు..
సెకండరీ ఆస్పత్రుల్లో ఉన్న ప్రధాన లోపాలు మౌలిక వసతులు, వైద్యుల కొరతే. నాడు–నేడుతో మౌలిక వసతుల కొరతను, కొత్త నియామకాలతో వైద్యుల కొరతను అధిగమించనున్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 718 మంది వైద్యులను ప్రభుత్వం నియమిస్తోంది. ఆగస్టు చివరి కల్లా వైద్యుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది. ఇది కాకుండా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు కలిపి మరో 990 మందిని నియమించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment