సాక్షి, అమరావతి: పేదలు, సామాన్యులు పైసా ఖర్చు చేయకుండా స్పెషాలిటీ వైద్యసేవలు పొందడం, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పనిలేకుండా సర్కారు ఆస్పత్రులకు జవసత్వాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోధనాసుపత్రులను ఉన్నతీకరించడం, కొత్త వైద్యకళాశాలలను నిర్మించడం ప్రధాన లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ చికిత్సలకు మాత్రమే అవకాశం ఉంది. పెద్ద ఆపరేషన్లు, చికిత్సలు చేయాలంటే మనకున్న అతిపెద్ద వైద్యవ్యవస్థ బోధనాసుపత్రులే. ఈ నేపథ్యంలో రూ.వేల కోట్లతో వీÐవీటి అభివృద్ధి పనులు టెండర్ల దశకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మందులు లేక, ఆస్పత్రుల లేక, వైద్యులు లేక రోగులు బోధనాసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడే రోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులపై భరోసా కల్పిస్తోంది.
రాష్ట్రంలో వైద్యవిద్య, బోధనాసుపత్రుల్లో జరుగుతున్న పనులు పరిశీలిస్తే...
► గతంలో ఎసెన్షియల్ మందుల జాబితాలో ఉన్నవి సంపూర్తిగా ఏనాడూ ఇవ్వలేదు. కేవలం 230 రకాల మందులు మాత్రమే దిక్కు. తాజాగా 510 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర మందులు అందుబాటులో లేవు అన్న మాటే వినిపించకుండా చర్యలు చేపట్టారు.
► అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్టు డాక్టర్లు లేక పేషెంట్లకు, వైద్య విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన పరిస్థితులు ఇక ఉండవు. అన్ని వైద్య కళాశాలలకు 755 అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్యుల నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఏ కాలేజీలోనూ కొరత ఉండదు. స్పెషాలిటీ సేవలు మెరుగుపడతాయి. వైద్యులే కాకుండా 389 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టింది.
బోధనాసుపత్రులకు మంచిరోజులు
రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. వీటిని నాడు–నేడు కింద రూ.6,100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వీటికి అనుబంధంగా ఉండే బోధనాసుపత్రులు అభివృద్ధి బాటలో పయనించనున్నాయి.
స్పెషాలిటీ ఆస్పత్రులు..
► రూ.175 కోట్లతో ఏజన్సీలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
► రూ.50 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కిడ్నీ రీసెర్చ్ మరియు డయాలసిస్ ఆస్పత్రి ఏర్పాటు
► కడపలో సైకియాట్రీ, క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ బ్లాకుల ఏర్పాటు
► కర్నూలులో ప్రాంతీయ క్యాన్సర్ స్పెషాలిటీ ఆస్పత్రి
► ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కొత్త విభాగాలు
► ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య ఉపకరణాలు కొనుగోలు చేస్తున్నారు
ఒకేసారి 16 కాలేజీలు.. చరిత్రలో మొదటిసారి
గత సర్కారు ఉన్న ఆస్పత్రులనే ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. 2007లో ఒకేసారి 4 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన చరిత్ర §దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది కాగా.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 16 కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికో వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు మొదలు కానున్నాయి. ఈ కళాశాలలను మచిలీపట్నం, అరకు, విజయనగరం, పులివెందుల, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, బాపట్ల, రాజంపేట, మార్కాపురం, నంద్యాల, ఏలూరు, గురజాల, హిందూపురం, అమలాపురం, ఆదోనిల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కళాశాలకు సుమారు రూ.400 కోట్లు వ్యయం చేస్తున్నారు.
120 పీజీ వైద్య సీట్లు పెరుగుదల
గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 120 పీజీ వైద్యసీట్లు పెరిగాయి. ఎక్కువగా జనరల్ మెడిసిన్, గైనకాలజీ సీట్లు పెరిగాయి. ఆర్థోపెడిక్, రేడియాలజీ సీట్లు పెరిగాయి. కర్నూలులో రెండు ¯నియోనెటాలజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు వచ్చాయి. మరిన్ని సీట్లు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
విజయవాడ, అనంతలో సూపర్ స్పెషాలిటీ సేవలు
విజయవాడ, అనంతపురం బోధనాసుపత్రుల్లో పీఎంఎస్‌ఎస్‌వై కింద రూ.150 కోట్లతో పనులు పూర్తయ్యాయి. రాష్ట్రవాటా చెల్లించకపోవడంతో గతంలో ఈ ఆస్పత్రుల్లో వైద్య ఉపకరణాలు రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించి ఎక్విప్‌మెంటు తీసుకొస్తోంది. కోవిడ్ కారణంగా జాప్యం జరిగింది. లేదంటే ఇప్పటికే అమల్లోకి వచ్చేవి.
భావి తరాలకు బంగారు బాట...
కొత్తగా ఒకేసారి 16 వైద్య కళాశాలలు ఏర్పాటు కానుండటం సాధారణ విషయం కాదు. మూడేళ్లలో ఈ కళాశాలలు పూర్తయితే సుమారు 2వేల సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో వైద్యకళాశాలలో రోజుకు 1,000 మంది ఔట్‌పేషెంట్ల లెక్కన అదనంగా 16వేల మందికి స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ తరాలకు ఇది బంగారు బాటే.
–డా.కె.వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment