
హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది కేసీఆరే
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి దేవినేని ఎదురుదాడి
సాక్షి, విజయవాడ బ్యూరో: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చెడగొడుతున్నది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాదని, తెలంగాణ ప్రభుత్వమూ, దానికి సీఎం అయిన కె.చంద్రశేఖరరావేనని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన బుధవారం సాయంత్రం విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. తెలంగాణ ప్రజల్లో వస్తోన్న వ్యతిరేకత, రైతుల ఆత్మహత్యల అంశాల నుంచి ఆ రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి ఏపీ ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాలలపై సరైన అవగాహన లేని కేసీఆర్, హరీశ్‌రావులు హైదరాబాద్‌కు నీరు రానీయకుండా ఏపీ అడ్డుపడుతోందని కేంద్రం దగ్గర ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. జూరాల, పాకాలకు నీళ్లంటూ నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు.