
'సంకల్ప దీక్ష కాదది... ఉత్తుత్తి దీక్ష'
రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీమాంధ్ర ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్ష... ఉత్తుత్తి దీక్ష మాత్రమే అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద దేవినేని ఉమా మాట్లాడుతూ... సంకల్ప దీక్ష అంటూ హైదరాబాద్లో దీక్ష చేపట్టిన ఆ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఇంటి ముందు ధర్నాలు, దీక్షలు చేపట్టాలని ఆయన సీమాంధ్ర ఎంపీలకు సూచించారు.
ఓట్లు, సీట్లు కోసమే సోనియా రాష్ట్ర విభజనపై నాటకాలాడుతుందని ఆయన ఆరోపించారు. శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలు శ్రీధర్ బాబు నుంచి సీఎం కిరణ్ తప్పించడాన్ని పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు రాజీనామా చేసి తెలంగాణ ప్రజల్లో హీరోగా నిలిచారని అన్నారు. సీఎం మాత్రం సమైక్యవాది అంటు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా నాయకత్వంలో ఈ తతంగమంతా జరుగుతుందని దేవినేని ఉమా పేర్కొన్నారు.