టీడీపీ ఆఫీసులు ఎందుకు తగులబెట్టారు?
విజయవాడ: తెలంగాణలో టీడీపీ కార్యాలయాలు తగులబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో మిగిలిన విద్యుత్ ను తెలంగాణకు ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.
నీటి వినియోగం విషయంలో నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోఉన్న నీటిని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఎగువనుంచి ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసే విద్యుత్ ఉత్పత్తి వల్ల వేలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవులోందని దేవినేని అన్నారు.
కాగ, తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లగొండ జిల్లాలో టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.