- కఠినంగా వ్యహరించిన టీటీడీ..
- ఒకరితో ఆరుమందికి మించకుండా టికెట్ల కేటాయింపు
తిరుమల: వేసవి సెలవులతో శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పోటెత్తింది. మరోవైపు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడుతో తెలుగుతమ్ముళ్లు సందడి పెరిగింది. ఇందుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కూడా శ్రీవారి దర్శనానికి క్యూ కట్టారు. అయితే టీటీడీ అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చినవారికే టికెట్లు కేటాయించారు.
ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, మృణాళిని, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, అవంతి శ్రీనివాస్, చీఫ్ విప్‌కాల్వ శ్రీనివాస్, విప్ రవికుమార్, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వెంకట సృజన కృష్ణరంగారావు, కాగిత వెంకట్రావు, బొగ్గురమణమూర్తి, గన్నబాబు, బాల వీరాంజనేయులు, దూళిపాటి నరేంద్రకుమార్, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు పదుల సంఖ్యలో నేతలు ఉన్నారు.
వీరికి బస, దర్శనం వంటి సపర్యలు చేయటం టీటీడీ అధికారులకు తలకుమించిన భారమైంది. వీరి రద్దీని ముందే ఊహించిన టీటీడీ అధికారులు సిఫారసు లేఖలకు, బ్రేక్ దర్శన టికెట్లు నిలిపేశారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, వారిలో ఒక్కోక్కరి వెంట కేవలం ఆరు మందికి మించకుండా అనుమతించారని టీటీడీ అధికారులు తెలిపారు.