సాక్షి, విజయవాడ : దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. నవరాత్రులలో భాగంగా ఏడవరోజున అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం కావడంతో వేకువజాము నుంచే భక్తుల రద్దీ అధికసంఖ్యలో ఉంది. అమ్మవారి దర్శనానికి మూడుగంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని శనివారం అన్నిరకాల వీఐపీ, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ముఖమండపం ద్వారానే అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కెనాల్ రోడ్డులోని కంపార్ట్‌మెంట్‌లు దర్శనానికి వచ్చిన భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి వచ్చేవారు తొక్కిసలాటకు గురవకుండా రోప్ సహాయంతో క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులను వదులుతున్నట్లు పోలీసులు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. ఈ ఏడాది శరన్ననవరాత్రుల ఏర్పాట్లు గతంలో కంటే బాగున్నాయని ఆమె పేర్కొన్నారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు : మంత్రి వెల్లంపల్లి
మూలా నక్షత్రం కావడంతో లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉదయం 9గంటల వరకు దాదాపు లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. కాగా దర్శనం సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారమే అమ్మవారిని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించినట్లు గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment