భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు
Published Sat, Aug 17 2013 2:49 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
విజయనగరం కల్చరల్, న్యూస్‌లైన్: శ్రావణ రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం పది గంటల నుంచి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. సామూహిక కుంకుమార్చనలు, విశిష్ట కుంకుమ పూజలు, కుంకుమార్చనలు మహిళలు జరిపించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ ఆలయాన్ని పలురకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేకువజామున అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం విశేష కుంకుమార్చన జరిపారు. విశిష్ట కుంకుమార్చనలో 50 మంది దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి కలువ పువ్వులతో పూజలు జరిపారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.భాను రాజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు మూలా పాపారావు, ఏడిద వెంకటరమణ పూజా కార్యక్రమాలను జరిపారు.
వేదపండితులు శంబర శంకరం, రాజేష్, సూపరింటిండెంట్‌లు సత్యనారాయణ, రామారావు పాల్గొన్నారు. శివాలయం వీధిలో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన సర్వకామదాంబ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనల్లో పాల్గొని పూజలు చేశారు. ఆలయ అర్చకులు చంద్రమౌళి విశ్వనాథ శర్మ పూజాకార్యక్రమాలు జరిపారు. కన్యకాపరమేశ్వరీ అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకులు ఆరవిల్లి ఉమామహేశ్వర శర్మ పూజాదికాలు జరిపారు. అలాగే మయూరి జంక్షన్‌లో ఉన్న సంతోషిమాత అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు.
స్థానిక మయూరి జంక్షన్‌లో ఉన్న సంతోషి మాత ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలంకరణ గావించారు. హంస వాహనంపై కలశాన్ని నింపి చేసిన దీపాలంకరణ కనువిందు చేసింది.
టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాలు
సాలూరు: టీటీడీ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్యామలాంబ ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. టీటీడీ జిల్లా రిసోర్స్‌పర్సన్‌లు ఉదాసీన స్వామిజీ, సోమనాథచారి భక్తులనుద్దేశించి మాట్లాడారు. పరమశివుని త్రిలింగ దేశంగా ప్రసిద్దికెక్కిన ఆంధ్ర రాష్ట్రన్ని ముక్కలు చేసి రాజకీయ లాభం పొందడానికి ప్రయత్నించడం అత్యంత దారుణమని అన్నారు. కేదరినాథ్ లాంటి ప్రళయాలను నివారించటానికి సమైక్యా భావనలే మార్గమని సూచించారు.
Advertisement
Advertisement