విజయనగరం టౌన్: తిరుమలేశుని దర్శించుకోవడానికి సాధారణ భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. గదులు, దర్శనాలు, సేవల కోసం ప్రతిరోజూ భక్తులు ఆయా జిల్లాల్లో ఉన్న టీటీడీ సుదర్శనం కౌంటర్‌ల వద్ద ముందస్తుగా బుకింగ్‌లు చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఏప్రిల్, మే నెలలకు గాను సుదర్శన్ బుకింగ్‌లలో సేవలు, దర్శనాలకు సంబంధించి సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల దృష్ట్యా అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకు నేందుకు తిరుమలకు ముందస్తుగా బుకింగ్‌లు చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ సేవలు ప్రారంభం కావడంతో బుధవారం వేకువ జామునుంచే స్థానిక టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో ఉన్న సుదర్శన్ కౌంటర్ వద్ద భక్తులు బారులు తీరారు.
ఎండ విపరీతంగా ఉండడంతో క్యూలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. సుదర్శనం కౌంటర్‌కు వెళ్లే దారిలో ప్రత్యేక షెడ్ కోసం కొన్నాళ్ల కిందట గుంతలు తవ్వి వదిలేశారు. నాటి నుంచి నేటి వరకూ ఆ గుంతల మధ్య నుంచే ఎవరైనా వెళ్లి దర్శన్, సేవలను తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఈనేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా భక్తులను ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదని పలువురు సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం, గదులు, సేవలకు సంబంధించి ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దర్శనానికి వెళ్లాల్సిన వారంతా ఇక్కడకు వచ్చి వేలిముద్రలు, ఫొటోలు తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిల్లాకు సంబంధించి విజయనగరం, బొబ్బిలిలో బుకింగ్ కౌంటర్‌లు ఉన్నా యి.
దీంతో పరిసర ప్రాంతాల్లోని వారంతా ఇక్కడకు చేరుకుని ముందస్తు బుకింగ్‌ల కోసం పాట్లు పడ్డారు. ఇక్కడ ఒకే ఒక కంప్యూటర్ ఆపరేటర్ విధులు నిర్వహించడం వల్ల ఒక పక్క వేలిముద్రలు, మరో పక్క కంప్యూటర్‌లో ఆన్‌లైన్ సేవలు చూడడం, డబ్బులు తీసుకుని రసీదులు ఇవ్వడం వంటి పనులు చేయడం వల్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రద్దీ సమయాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
టీటీడీ ఆన్ లైన్ సేవలు ప్రారంభం
Published Thu, Apr 2 2015 3:56 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM
Advertisement
Advertisement