ఆశల త‘రుణం’ | DFS farmers | Sakshi
Sakshi News home page

ఆశల త‘రుణం’

Published Tue, May 20 2014 12:32 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

ఆశల త‘రుణం’ - Sakshi

ఆశల త‘రుణం’

 తెలుగుదేశం ఇచ్చిన ఎన్నికల హామీల్లో రైతుల రుణమాఫీ ప్రధానమైనదని చెప్పవచ్చు. తర్వాత డ్వాక్రా రుణాల రద్దూ ఆ పార్టీ వాగ్దానాల్లో కీలకమైనదే. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఆ పార్టీయే గనుక.. జిల్లాలో లక్షలాది మంది రైతులు, 70 వేల డ్వాక్రాసంఘాల్లోని మహిళలూ కోటి ఆశలతో ఆ హామీల అమలు కోసంఎదురు చూస్తున్నారు. మరోవైపు టీడీపీ హామీలతో గత నాలుగు నెలలుగా ఆ రుణాల చెల్లింపు నిలిచిపోయిందని బ్యాంక్ అధికారులు అంటున్నారు.
 
 సాక్షి, కాకినాడ : మనది వ్యవసాయ ప్రధానమైన జిల్లా. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పైచేయి సాధించడంతో.. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ముఖ్యంగా గ్రామసీమల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు హామీలపై చర్చే వినబడుతోంది. టీడీపీ దశను మార్చాయని భావిస్తున్న హామీలను ఏర్పాటు కానున్న చంద్రబాబు సర్కారు అమలు చేసే రోజు కోసం రైతులు, డ్వాక్రా మహిళలూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

 రైతు పక్షపాతి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒత్తిడి మేరకు యూపీఏ-1 ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు రూ.74 వేల కోట్ల రైతురుణాలు మాఫీ చేయగా, మన రాష్ర్ట రైతులకు సంబంధించి రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అనంతరంగా వైఎస్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్షా 27 వేల కోట్ల రుణాలు పొందగలిగారు. కొత్త ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ మొత్తం రూ.68 వేల కోట్ల వరకు ఉంటుందని లెక్కతేల్చారు. మన జిల్లా వరకు చూస్తే జాతీయ, గ్రామీణ, కో ఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి 600 శాఖలున్నాయి. వీటిలో 50కి పైగా డీసీసీబీ బ్రాంచ్‌లుండగా, 33 గ్రామీణ బ్యాంకులు, 70కి పైగా ప్రైవేటు బ్యాంకుల శాఖలు కాగా, మిగిలినవన్నీ జాతీయ బ్యాంకులవి.

వీటి పరిధిలో 3.60 లక్షల మంది రైతులకు పంట రుణాల కింద రూ.2,750 కోట్లు మంజూరు చేయగా, వాటిలో పాతబకాయిలు సుమారు రూ.450 కోట్లున్నాయి. మరో4.50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.4,050 కోట్ల మేర బంగారం మీద ఇచ్చిన రుణాలున్నాయి. అంటే జిల్లాలో రైతులకు సంబంధంచి అన్ని రకాల రుణాలు సుమారు రూ.6,800 కోట్ల వరకు ఉన్నాయి.

 30 శాతం కూడా లేని చెల్లింపులు
 సాధారణంగా రైతులు తొలి పంట(ఖరీఫ్)కు తీసుకున్న రుణాలను మార్చి 31 లోగా, రెండో పంట(రబీ) రుణాలను జూలై 31 లోగా చెల్లిస్తుంటారు. టీడీపీ రుణమాఫీ హామీ ప్రభావంతో గతనాలుగు నెలలుగా రైతు రుణాల చెల్లింపు దాదాపు నిలిచిపోయింది. పాతబకాయిలు రూ.450 కోట్లు కలిపి మరో రూ.600 కోట్ల వరకు మార్చి మాసాంతానికి వసూలయ్యేవి. అయితే 30 శాతం కూడా వసూలు కాలేదు.

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రైతుల రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నిలిచి పోవడంతో టర్నోవర్ నిలిచిపోయిందని, దీనివల్ల వచ్చే ఖరీఫ్‌లో తిరిగి పంట రుణాలివ్వడం కష్టతరమేని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా రుణాల మాఫీ మార్గదర్శకాలు జారీ కాకుంటే బ్యాంకులకు మరింత చిక్కు సమస్య ఎదురవుతుందని కాకినాడలోని ఓ జాతీయ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ అన్నారు.  

 డ్వాక్రా రుణాలదీ అదే బాట
 డ్వాక్రా సంఘాలకు సంబంధించి మ్మడి రాష్ర్టంలో రూ.25 వేల కోట్ల రుణాలుంటే కొత్తగా ఏర్పడబోయే మన రాష్ర్టంలో 13 జిల్లాలకు సంబంధించి రూ.14 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఒక్క మన జిల్లాలోనే 70 వేల డ్వాక్రా సంఘాలకు రూ.1,300 కోట్ల మేర రుణాలున్నాయి. వీటిలో పాతబకాయిలు రూ.70 కోట్లు. రైతులు పంట చేతి కొచ్చే సమయంలోనే రుణాలు చెల్లిస్తుంటారు. కానీ డ్వాక్రా మహిళలు ప్రతి నెలా ఠంచన్‌గా రుణాలు చెల్లిస్తుంటారు. లేకపోతే వడ్డీ మినహాయింపు వర్తించదు.

అయితే ప్రస్తుతం వీరు కూడా రుణాలు చెల్లించడం లేదు. ప్రతి నెలా వీరి ద్వారా రూ.40 కోట్ల వరకు రికవరీ ఉంటుంది. గత నాలుగు నెలలుగా ఇది పూర్తిగా నిలిచిపోయింది. ఇలా ఓవైపు రైతురుణాలు, మరోవైపు డ్వాక్రా రుణాల చెల్లింపు నిలిచిపోవడంతో బ్యాంకుల టర్నోవర్ క్షీణించింది. రుణాల రికవరీ కోసం రిజర్వు బ్యాంకు నుంచి ఒత్తిళ్లు వస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని బ్యాంకుల అధికారులు అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement