
రెచ్చగొడితే.. క్రిమినల్ కేసులు: దినేష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆందోళనల సందర్భంగా రెచ్చగొట్టే వాఖ్యలుచేస్తే క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని పోలీసుశాఖ ప్రకటించింది. ఆందోళనల సందర్భంగాప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను నష్టపరిచే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎస్పీలకూ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వి. దినేష్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసిం ది. ఆందోళనలను పురస్కరించుకుని హింసాత్మక ఘటనలకు దిగితే ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సీమాం ధ్రలో ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ వారం రోజుల వ్యవధిలో 124 కేసులు నమోదు చేశామ ని, ఆ కేసుల్లో 221 మంది నిందితులను అరెస్టుచేశామని వివరించారు.
మరో వెయ్యిమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జాతీయనేతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడినవారిపై కఠి నంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకూ 39 కేసులు నమోదుచేసి 94 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ 153 (ఎ) సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని, ఈ కేసు నిరూపితమైతే మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. శాంతియుత పద్ధతుల్లో ఆందోళనలు, నిరసనలు చేసే వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోబోరని, హింసాత్మకఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
కఠినచర్యలు తీసుకోండి: సీఎం
సీమాంధ్ర ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు మరింత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సీమాంధ్రలో ఆందోళనల సందర్భంగా జాతీయ నేతల విగ్రహాల ధ్వంసంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఆందోళనల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం ఆదేశించిన నేపథ్యంలో పోలీ సులు వేగం పెంచారు. విగ్రహాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆ స్తుల ధ్వంసం కేసుల్లో అరెస్టులను మరింత వేగవంతం చేశారు.