చంద్రబాబు అవినీతి దేశానికే ప్రమాదం | Dharmana Prasada Rao Fires on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అవినీతి దేశానికే ప్రమాదం

Published Sun, Nov 25 2018 7:16 AM | Last Updated on Sun, Nov 25 2018 7:23 AM

Dharmana Prasada Rao Fires on CM Chandrababu Naidu - Sakshi

వజ్రపుకొత్తూరు: సీఎం చంద్రబాబునాయుడు వ్యూహాత్మక దోపిడీ, అవినీతి దేశానికే ప్రమాదకరమని, అధికారం రాగానే తన కార్యాలయం నుంచే దోపిడీకి సిద్ధమయ్యారని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో హనుమంతు వెంకట్రావు దొర ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ తిత్లీ తుపాను బాధితులందరినీ జగన్‌ కలుస్తారని, ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తారని భరోసా ఇచ్చారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తీసుకువచ్చి, సీఆర్‌డీఏ చట్టాలను ఏకపక్షంగా సవరించడం ద్వారా వ్యూహాత్మక దోపిడీకి అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు. రాజధాని పేరుపెట్టి రాష్ట్ర ప్రజల నోరు నొక్కారని మండిపడ్డారు.

 సింగపూర్‌ బొమ్మ చూపి అక్కడి ప్రైవేటు కంపెనీలకు వేల కోట్లు రూపాయలు ధారాదత్తం ధ్వజెమత్తారు. శివరామ కృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడి ఉందని నివేదికల్లో పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన 12 సంస్థల్లో ఒక్కటి కూడా స్థానికంగా ఏర్పాటు చేయలేకపోయారని ఆక్షేపించారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమని, అలుపెరుగకుండా చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

25 కిలోల కోసం 3 రోజులా?
ముఖ్యమంత్రి వైఫల్యం, ప్రభుత్వ సాయం అందకపోవడంతో నిలదీసిన వారిపై అక్రమ కేసులు బనాయించి ప్రజల గొంతు నొక్కారని పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే తిత్లీ తుపాను పరిహారం కోసం టీడీపీ సభ్వత్వ కార్డుతో రావాలని ఎస్‌ఎంఎస్‌లు పంపించడం దారుణమన్నారు. తిత్లీ బాధితులకు కేవలం 25 కిలోల బియ్యం ఇచ్చేందుకే 3 రోజులపాటు పలాసలో ఉన్నారా అని మండిపడ్డారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం డిమాండ్‌ చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అంతకు ముందు పార్టీ నాయకులకు బెండి గ్రామస్తులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం అప్పయ్యదొర విగ్రహానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలల వేసి, నివాళులర్పించారు.

 కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు దువ్వాడ హేమబాబు చౌదరి, మెట్ట కుమారస్వామి, బళ్ల గిరిబాబు, పలాస, మందస మండలాల పార్టీ అధ్యక్షులు పైల చిట్టి, అగ్గున సూర్యారావు, మండల ప్రధాన కార్యదర్శి తమ్మినేని శాంతారావు, పలాస పట్టణ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్, సరుబుజ్జిలి ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, బోర కృష్ణారావు, డబ్బీరు భవానీశంకర్, యువజన విభాగం మండల అధ్యద్యక్షుడు కొల్లి రమేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దున్న వీరస్వామి, నాయకులు హనుమంతు కిరణ్‌కుమార్, ఉంగ సాయికృష్ణ, బళ్ల గిరిబాబు, డొక్కరి దానయ్య, పీఏసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, మరడ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.

ఓట్లను కాపాడుకోవాలి
వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన 20 వేల మంది ఓటర్లను జిల్లాలో తొలగించేందుకు సర్వేలు చేపట్టారని, దీనిపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించి, పోరాటాలతో సాధించుకున్న ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో ఇసుక, మైన్స్, వైన్స్‌ మాఫియా దొరికినంత దోచుకుంటున్నారని, కోట్లాది రూపాయల విలువైన భూములను తమకు కావాల్సిన వారికి దోచి పెడుతున్నారని విమర్శించారు. దివంగత ఎంపీ హనుమంతు అప్పయ్య దొర నీతి, నిజాయితీ కలిగిన ఉత్తమ పార్లమెంటేరియన్‌ అని అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కొనియాడారని గుర్తుచేశారు. బెండిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం జిల్లాలో పార్టీ విజయానికి నాంది కావాలని ఆకాంక్షించారు. 

సీఎం అబద్ధాల పుట్ట
శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సోనియా, రాహుల్‌ గాంధీలను రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేయాలని గతంలో తిట్ల దండకం అందుకున్నారని గుర్తుచేశారు. అయితే... కేసుల భయంతో అదే కాంగ్రెస్‌ పంచన చేరారని విమర్శించారు. మోదీ అంతటి నాయకుడు లేరని అసెంబ్లీలో ప్రశంసించిన సీఎం.. ఎన్‌డీఏ నుంచి బయటకు రాగానే ప్రధానిపై చిందులేస్తున్నారని ఆక్షేపించారు. నోరు విపిత్తే చంద్రబాబు నోట అబద్ధాలు తప్ప ఇంకేమీ రావని తూర్పారబట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement