తాజా మంత్రాంగం!
Published Sun, Nov 24 2013 3:20 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నారు. నెలరోజుల క్రితమే గార, శ్రీకాకుళం రూరల్ మండల కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, వారి నిర్ణయం మేరకే నడుకుంటానని చెప్పిన ధర్మాన శ్రీకాకుళం పట్టణ పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానో.. కాదో తెలియకున్నా.. అన్ని పార్టీల సానుభూతిపరులైన సర్పంచ్‌లతో ఆది వారం ఉదయం అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన రాష్ట్ర విభజన అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోనే ప్రయత్నాల్లో పడ్డారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకు లేదా తీర్మానం కోసం చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. దాన్ని అవకాశంగా వినియోగించుకుని పార్టీ నాయకత్వాన్ని కడిగేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే సమస్యలు, ప్రజలకు వచ్చే కష్టాలతో పాటు, మరెన్నో సమస్యలపై సుదీర్ఘ ప్రసంగం చేసేందుకు అవసరమైన సమచారాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. నిత్యం తనను కలుస్తున్న పార్టీ నాయకులకు ఇదే విషయం చెప్పడంతోపాటు ఒకవేళ తాను పార్టీ వీడితే తనతో వచ్చేవారెందరన్న లెక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఓ ముగ్గురు నాయకులు మినహా, మిగిలిన వారంతా తనతోనే వస్తారన్న ధీమా ఆయనలో వ్యక్తమవుతోంది. గార, శ్రీకాకుళం రూరల్ మండలాలకు చెందిన క్యాడర్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి ధర్మాన వెంటే నడిచేందుకు తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళంతోపాటు, జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఎవరెవరు తన వెంట నడుస్తారన్న సమాచారాన్ని ధర్మాన ఇప్పటికే సేకరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో పార్టీని ఎండగట్టడం.. వారు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే క్యాడర్‌తో సహా బయటకు రావడం .. ఆయన వ్యూహంగా భావిస్తున్నారు. తనంతట తాను పార్టీని వీడే కంటే పార్టీయే తనను బయటకు పంపేలా చేస్తే రాజకీయంగా కలిసి వస్తుందన్నది ధర్మాన యోచన. కాంగ్రెస్ పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న తనపై మచ్చ వేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. 2004కు ముందు కూడా రెండు దఫాలు మంత్రిగా పనిచేసినా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయాంలోనే ధర్మానకు జిల్లా నాయకునిగా గుర్తింపు వచ్చింది. వైఎస్సార్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ రెండు దఫాలు రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించారు.
ఈ కారణంగానే ధర్మాన చేసిన పలు ప్రయోగాలు సైతం సక్సెస్ అయ్యాయి. ఓసారి ఓడిన డాక్టర్ కిల్లి కృపారాణిని ఎందరో వారించినా ఎంపీగా, జుత్తు జగన్నాయకులును పలాస నుంచి శాసనసభ స్థానానికి పోటీ చేయించి గెలిపించడం కొన్ని ఉదాహరణలు. డాక్టర్ వైఎస్సార్ చరిష్మా, ధర్మాన వ్యూహాలు అప్పట్లో ఈ విజయాలు సాధించిపెట్టాయి. అయితే వైఎస్సార్ మరణానంతరం ఆయనపైనా, ఆయన కుటుంబం పైనా ధర్మాన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడితే కాంగ్రెస్ తనను అక్కున చేర్చుకుంటుందని ధర్మాన భావించగా, అందుకు విరుద్ధంగా కేసుల్లో ఇరికించి పదవిని సైతం వదులుకొనేలా చేసింది. అదే సమయంలో రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీమోహన్, కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలను జిల్లాలో తనకు ప్రత్యర్థులుగా తీర్చిదిద్దింది. ఇటువంటి అవమానాలను ఎదుర్కొన్న ధర్మాన రాష్ట్ర విభ జన అంశాన్ని అస్త్రంగా ప్రయోగించి కొత్త రాజకీయానికి బాటలు వేసుకోవాలని భావిస్తున్నారు.
Advertisement