'ఏపీలో అభివృద్ధి నిలిచిపోయింది'
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద్ రావు అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం మంత్రులు బదిలీలపై చూపే శ్రద్ధ పాలనపై చూపడం లేదని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ధర్మాన.. శాంతి భద్రతలను టీడీపీ నేతలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారన్నారు. అభివృద్ధి పనులకు నిధులు లేవని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
ఆరు నెలలు గడవకముందే టీడీపీ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత పెరిగిందని ధర్మాన మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాల ఎందుకన్ని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అసలు ప్రభుత్వం అన్ని వేల ఎకరాలను ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని అమలు చేసైనా భూసేకరణ చేస్తామని సీఎం చంద్రబాబు బెదిరించడం విడ్డూరంగా ఉందన్నారు.