
చుక్కలు చూపిన మందు!
పాలకొండ రూరల్:‘మా డ్రాప్స్ వేసుకుంటే పిల్లల్లో ధాతుపుష్టి ఏర్పడుతుంది. ఆకలి పెరుగుతుంది. శారీరక ఎదుగుదల బాగుంటుంది. రూ. 13 చెల్లిస్తే.. ఓ హెల్త్ కార్డు ఇస్తాం. నాలుగు వారాలు డ్రాప్స్ వేస్తాం’.. గత రెండు రోజులుగా పాలకొండ నగర పంచాయతీ, మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఓ ప్రైవేట్ సంస్థ చేసిన ప్రచారం స్థానికులను బాగా ఆకట్టుకుంది. బుధవారం సుమారు 67 మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు ఈ డ్రాప్స్ వేయించారు. అయితే కొన్ని గంటల్లోనే పరిస్థితి తిరగబడింది.. చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి వంటి బాధలతో పిల్లలు పడుతున్న బాధ చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలను పట్టుకొని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పరుగులు తీశారు.
రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ వాతావరణం మారిపోయింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ అయి న చిన్నపిల్లల వైద్య నిపుణుడు రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో వారందరినీ పరీక్షించి కడుపునొప్పితో కూడిన అస్వస్థతగా నిర్థారించి చికిత్స అందించారు. ఎటువంటి ప్రమాదం లేదని తేల్చడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎన్.చరణ్(2), ఎన్.గోపి(4), సంజన(5), శ్రీలత(1)తో పాటు 33 మంది చిన్నారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఆయుర్వేదానికి చెందిన ఈ డ్రాప్స్ కొందరికి పడవచ్చు.. కొందరికి పడకపోచ్చని చెప్పారు. ఆ విషయం నిర్థారించుకోకుండా వేయడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.
విచారణ జరిపిస్తాం:డీఎంహెచ్‌వో
విస్తృత ప్రచారం చేసి, పిల్లలకు డ్రాప్స్ వేసిన శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఈ సంస్థకు అనుమతులు ఉన్నాయా? అన్న విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్యామలను ప్రశ్నించగా ఈ తరహా సంస్థ గూర్చి తమకేమీ సమాచారం లేదన్నారు. దీనిపై స్థానిక అధికారులతో చర్చిస్తామని, విచారణ కూడా చేపడతామన్నారు. స్థానిక పోలీసులను సంప్రదించగా ఏరియా ఆస్పత్రి నుంచి తమకు సమాచారం లేదని, వైద్యులు సమాచారం అందిస్తే మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ ఎల్.చంద్రశేఖర్ చెప్పారు. ఈ తరహా సంస్థలు, గుర్తింపు లేని వైద్య బృందాలు ఇచ్చే వ్యాక్సిన్లు, డ్రాప్స్ వేసుకునేముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలని, వెద్యుల సూచనలు తీసుకోవాలని ఏరియా ఆస్పత్రి వైద్యులు సూచించారు.
అవి బాల్‌కాల్విన్ డ్రాప్స్
కాగా డ్రాప్స్ వేసిన సంస్థ ప్రతినిధి ఈశ్వరి, మరో అమ్మాయిని ‘సాక్షి’ ప్రశ్నించగా శ్రీకాకుళంలోని కృష్ణాపార్కు వద్ద నుంచి హెల్త్‌కేర్ సెంటర్ నుంచి వచ్చామని చెప్పారు. పాల కొండ పట్టణంతో పాటు మండల పరిధిలో ప్రచారం చేసి బాల్‌కాల్విన్(కాల్షియం) డ్రాప్స్ వేశామని వివరించారు. 1-5 ఏళ్ల పిల్లలకు ఒక డ్రాప్, 5-10 మధ్య వారికి రెండు డ్రాప్స్, 10-15 మధ్య వారికి మూడు డ్రాప్స్ చొప్పున నాలుగు వారాలపాటు వేయాల్సి ఉంటుందన్నారు. అయితే పిల్లలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో అర్థం కావడంలేదని.. ఇంతకుముందు చాలా చోట్ల వేసినా ఇటువంటి సమస్య ఎదురుకాలేదన్నారు.