ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రానికి పరుగు తీస్తున్న గోదావరి జలాలు
చినుకు పడితే ఆనందం ... ఆ చినుకుల జోరు పెరిగితే భయం. మళ్లీ కొద్ది నెలలకే నీటికోసం కటకట. ఇలాంటి పరిణామాలు ఎందుకు తలెత్తుతున్నాయి...కుండపోతగా కురిసిన వర్షపు నీటిని పది కాలాలపాటు భద్రపరుచుకొని ... వినియోగించుకునే సామర్థ్యం కొరవడడమే దీనికి కారణం. అలా చేయగలిగితే లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యేవి. వేలాది గ్రామాల్లో దాహార్తి తీరేది. ప్రకృతి ప్రసాదించిన ఈ నీటిని ... సముద్రంలో కలిసిపోతున్న లక్షల క్యూసెక్కుల జలాన్ని భవిష్యత్తు తరాలకోసం ఎలా వినియోగించుకోవాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది.
సాక్షి, తూర్పుగోదావరి : జూలై 5వ తేదీ..సాధారణంగా ఆ సమయానికి గోదావరికి ఎంతోకొంత వరద పోటు తగులుతుంటుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి స్వల్ప మొత్తంలోనైనా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. బ్యారేజీ నుంచి ఒక్క క్యూసెక్కు నీరు కూడా సముద్రంలోకి వదలలేదు. తరువాత నీటి రాక పెరిగినా పంట కాలువలకు, పట్టిసీమకు తోడివేయగా మిగిలిన కొద్దిపాటి నీటిని మాత్రమే సముద్రంలోకి విడదల చేసేవారు. ఈ సమయంలో గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగుకు పూర్తిస్థాయిలో నీరందించగలమా? అనే అనుమానం అధికార యంత్రాంగంలో కూడా వచ్చింది. ముఖ్యంగా గత జూలై 27 నుంచి వరద జోరందుకుంది. జూలై 27న 20,953 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తరువాత రోజు అదికాస్తా 33,475 క్యూసెక్కులకు పెరిగింది. అలా పెరుగుతూ..పెరుగుతూ ఈ నెల 9వ తేదీన అత్యధికంగా 14,59,068 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
మొత్తం మీద జూన్ 1వ తేదీ నుంచి ఇంత వరకూ 1294.35 టీఎంసీల నీరు సముద్రంలో కలవడం విశేషమైతే, గడిచిన 12 రోజుల్లోనే ఏకంగా 1,159. 284 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే మొత్తం మీద 90 శాతం నీరు గడిచిన 12 రోజుల్లోనే సముద్రంలోకి వదిలారు. జూన్ నెలలో సముద్రంలోకి వదిలింది కేవలం 2.131 టీఎంసీ కాగా, జూలైలో 132.935 టీఎంసీలు. ఈ నెలలో కూడా 25వ తేదీ నుంచి 31వ తేదీకి మధ్యలోనే 85 శాతం నీరు సముద్రంలోకి వదిలినట్టు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైన తరువాత ఇప్పటి వరకు పట్టిసీమకు 22.924 టీఎంసీలు, డెల్టా కాలువలకు 62.648 టీఎంసీల నీటిని విడుదల చేయగా, సముద్రంలోకి 1,294.35 టీఎంసీల నీరు వదిలారు. ఈ నేపథ్యంలో వృథా జలాలను ఏవిధంగా సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉందో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment