చక్కెర వ్యాధి.. ఎంతో చేదు | Diabetes Patients Hikes In West Godavari | Sakshi
Sakshi News home page

చక్కెర వ్యాధి.. ఎంతో చేదు

Published Wed, Nov 14 2018 8:00 AM | Last Updated on Wed, Nov 14 2018 8:00 AM

Diabetes Patients Hikes In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, నిడమర్రు: చక్కెర వ్యాధి.. ఈ వ్యాధికి పేరులోనే చక్కెర.. దాని ఫలితమంతా ఎంతో చేదు. ఆ వ్యాధి వస్తే చక్కెరకు ఇక దాదాపు దూరమైనట్లే. భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి మరింత అధికమని గణాంకాలు చెపుతున్నాయి. జిల్లాలో ప్రతి నెల కొత్తగా సుగర్‌ వ్యాధి బారిన పడుతున్నవారు 5వేల నుంచి 6వేలు మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 35 నుంచి 45 ఏళ్ల వయసున్న వారే ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతి 20 మరణాల్లో ఒకటి మధుమేహ సంబంధిత వ్యాధుల కారణంగానే అని వరల్ట్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది. దీన్ని నివారించడం అంత తేలిక కానప్పటికీ, కొన్ని రకాల విధి విధానాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా సమర్ధంగా ఎదుర్కోవచ్చుఅని వైద్యులు భరోసా ఇస్తున్నారు. నేడు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం సందర్భంగా కథనం..

జిల్లాలో రూ.6 లక్షల మందికి
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్యపరిభాషలో డయాబెటిస్‌  మెల్లిటస్‌ అని వ్యవహరిస్తారు. జిల్లాలో 39 లక్షల మంది జనాభా ఉంటే 25 ఏళ్లు పైబడిన వారు 27 లక్షల మంది వరకూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు గణాంకాలు పరి శీలిస్తే జిల్లాలో సుమారు రూ.6 లక్షల మంది వరకూ సుగర్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలు స్తోంది. ప్రతి ఏడుగురిలో ఒకరిని ఈ వ్యాధి వెంటాడుతోంది. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే మధుమేహం వివిధ స్టేజిల్లో ఉన్న 1,24,665 మంది రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తున్నట్లు ఎన్‌సీడీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. 104 ద్వారా మరో 15వేల మందికి ప్రతినెల సుగర్‌ మందులు అందిస్తున్నారు.

ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్లే
ఈ వ్యాధి శరీరంలోని ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్‌ స్థాయి వంటి లక్షణాలతో కూడిన రుగ్మత. చక్కెరవ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చెక్కర స్థాయినిబట్టి గుర్తిస్తారు.

శరీరంలో చక్కెర నిల్వలుతగ్గడానికి కారణాలు
ఆహారం సరిగా తీసుకోకపోవడం,ఉపవాసాలు
అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం, శారీరక శ్రమ
ఇన్సులిన్, యాంటీడయాబెటిక్, నొప్పి నివారణ మందులు ఎక్కువ మొతాదులో తీసుకోవడం.
అధికంగా మత్తుపానీయాలు తీసుకోవడం.

రక్తంలో చక్కెరశాతం తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు
అతిగా ఆకలి, అతి చెమట, మూర్చపోవడం, బలహీనత, ఎక్కువగా గుండె కొట్టుకోవడం.
పెదవులకు తిమ్మిరి  
చూపు మసకబారడం
తలనొప్పి, చేసేపనిపై శ్రద్ధ లేకపోవడం.
తికమక పడటం, అలసిపోవడం, బద్ధకం.

ఈ స్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కచ్చితమైన ఆహార సమయాలు పాటిస్తూ, సరైన సమయంలో మందులు వాడడం.
రక్తంలో చక్కెర నిల్వ స్థితి పెంచేందుకు 3,4 చెంచాల చక్కెర లేదా గ్లూకోజ్‌ తీసుకోవాలి.

వ్యాధి నిర్ధారణ
మధుమేహ వ్యాధిని రక్త, మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.
రక్తపరీక్ష :  సాధారణంగా రక్తంలో చక్కెర శాతం 80 నుంచి 140 మి. గ్రాముల వరకు ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ ఉంటే చక్కెర ప్రారంభమైనట్లు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చక్కెర శాతం 60 నుంచి 90 ఎంజీ/ డీఎల్, తిన్న తరువాత 110 నుంచి 140ఎంజీ/ డీఎల్‌ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే.  
మూత్ర పరీక్ష : సాధారణంగా మూత్రంలో చక్కెర ఉండదు. ఒక వేళ మూత్రంలో చక్కెర గుర్తిస్తే వ్యాధి ఉన్నట్లే.

రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేసి  శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
భోజనానికి అరగంట ముందు నిర్ణీతసమయంలో మాత్రలు వేసుకోవాలి.
రోజూ ఒక నిర్ణీత సమయంలోనేభోజనం చెయ్యాలి.
ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి.
మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకూ తెలియదు. స్పర్శలేకపోతే ప్రతి ఆరు లేదా మూడు మాసాలకు ఒకసారి వైద్య పరీక్ష చేయించాలి.
పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, అనెలు  ఉన్నాయోమో గమనించాలి.
గోళ్లు తీసి సమయంలోఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతిరోజు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఇన్‌ఫెక్షన్‌తో కాళ్లకు చీముపడితే డాక్టర్‌ సలహాలతో మందులు వాడాలి.

మానుకోవాల్సిన అలవాట్లు
తీపి పదార్థాలు, ఐస్‌క్రీమ్‌ మానుకోవాలి. నూనె పదార్థాలను తినడం తగ్గించాలి
పాదరక్షలు లేకుండా నడవకూడదు
పొగతాగరాదు
మానసికి ఒత్తిళ్లను తగ్గించుకోవాలి
కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వుతో కూడిన మాంసం, గుడ్లు తినరాదు.

ఆరోగ్య క్రమశిక్షణ లేనివారిలోనే..
 ఆరోగ్య క్రమశిక్షణ లేని వారిలోనే డయాబెటిస్‌ లక్షణాలు మొదలవుతున్నాయి. మానసిక ఒత్తిడికి గురవడం, జంక్‌ఫుడ్, కనీస వ్యాయామ నియమాలు పాటించక చాలామంది ఈ వ్యాధిబారిన  పడుతున్నారు. వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు.–   డాక్టర్‌ షర్మిల, సుగర్‌ వ్యాధి నిపుణులు, భీమవరం

సుగర్‌ కంట్రోల్‌ లేకపోతే రెటీనాపై
సుగర్‌ వ్యాధిని నియంత్రించకుంటే కంటి రెటీనాపై ప్రభావం పడి చూపుమందగిస్తుంది. రెటీనాలోని రక్తం గడ్డకట్టి ఇతర సమస్యలతోపాటు, ఒక్కోసారి కంటి రెప్పల కదలికలు ఆగిపోయి నేత్ర పక్షవాతానికి దారితీయవచ్చు.రోగులు ఏటా కంటి పరీక్షలు చేయించుకోవాలి.–డాక్టర్‌  యూవీ రమణరాజు, కంటివైద్య నిపుణులు, భీమవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement