జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను పరామర్శిస్తున్న అప్పిరెడ్డి
గుంటూరు మెడికల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో డయేరియా వ్యాధి విజృంభిస్తోంది. మూడు రోజుల్లో 200 మంది వ్యాధిపీడితులుగా మారి ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో నగరంలో తీవ్ర అలజడి రేగింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డయేరియా ఒక్కసారిగా విజృంభించడానికి కారణాలు తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొలుత కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో రోగులు ఆస్పత్రులకు చేరుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సుమారు 600 శాంపిళ్లు సేకరించి నీటి పరీక్షలు నిర్వహించారు.
అయితే ఆ పరీక్షల్లో నీరు కలుషితమైనట్లు తేలలేదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు మాట్లాడుతూ డయేరియా విజృంభణకు కలుషిత నీరు లేదా ఆహారం విషతుల్యంగా మారడమా అనేది తేలాల్సి ఉందన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం పర్యటిం చారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ నేతృత్వంలో పది వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులతో డోర్ టూ డోర్ సర్వే చేయించి, బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. నగరంలో ఒక్కరోజు పాటు నీటి సరఫరా నిలిపివేసి, శాంపిళ్లు తీసిన అనంతరం పూర్తి స్థాయిలో క్లోరినేషన్ చేసి తిరిగి నీరు విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేసి డయేరియా బాధితులను ఆసుపత్రులకు తరలించేలా చర్యలు చేపట్టారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లోనే నేరుగా ప్రత్యేక శిబి రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.
200 మంది బాధితులు.. ముగ్గురు మృతి
నగరంలో డయేరియా బారినపడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్, జ్వరాల ఆస్పత్రిలో సుమారు వంద మంది వరకు చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జ్వరాల ఆస్పత్రిలో బెడ్‌లు లేకపోవడంతో వైద్యులు నేలపైనే రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్తున్నారనేది లెక్క తేలాల్సి ఉంది.
జీజీహెచ్‌లో మెడికల్ ఎమర్జెన్సీ
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మంగళవారం మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. మూడు రోజులుగా ఆస్పత్రికి డయేరియా బాధితులు వస్తున్నారని, మంగళవారం ఒక్కరోజే 60 మందికి పైగా బాధితులు రావటంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో డయేరియా బాధితుల కోసం మంగళవారం 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేశారు. బాధితులకు వైద్యసేవలను అందించేందుకు స్టాఫ్ నర్సులు, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్‌లు, ఆర్‌ఎంఓలు, జూనియర్ డాక్టర్లను నియమించారు. డ్యూటీ లేని వారిని సైతం విధులకు హాజరుకావాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. బాధితులకు ఆస్పత్రి అధికారులు మినరల్ వాటర్ బాటిళ్లు ఇచ్చి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కలుపుకొని తాగాలని సూచించారు.
భయందోళనలో నగర ప్రజలు
గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పది డివిజ న్లలో ఒక్కసారిగా డయేరియా విజృంభించడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారంటూ రోగుల బంధువులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయా ప్రాంతాల్లో 600 శాంపిళ్లు తీసి మరీ నీటి పరీక్షలు చేశామని, నీటిలో తేడా ఉన్నట్లు కని పించలేదని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు. పాతగుంటూరు, ఆనందపేట, వినోభానగర్, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి నెలకొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం కావడంతో బాధితుల్లో అధికశాతం మంది చికెన్, మటన్ తిన్నట్లు చెబుతున్నారు. నిల్వ ఉన్న మాంసం తినడం వల్ల ఇలా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇంత పెద్ద ఎత్తున్న డయేరియా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో డయేరియా విజృంభించడంతో నగర వాసులకు కంటిపై కునుకులేకుండా పోయింది. వ్యాధి ప్రబలడానికి కారణం ఏమిటో తెలియకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment