
బాబు సీఎం అవుతారని నేననలేదు: అశోక్‌బాబు
* ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టీకరణ
* ఈనాడు ఏదో రాసుకుంటే నేనేం చేయగలను?
* నేనలా అన్నట్లు ఆధారాలుంటే చూపించండి
* ఉద్యోగులకు అన్యాయం జరిగితే సమ్మెకూ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మీరే ముఖ్యమంత్రి అని తాను చంద్రబాబుతో అనలేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో జేఏసీ నేతలు చంద్రశేఖరరెడ్డి, నరసింహారెడ్డి తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబును మీరే ముఖ్యమంత్రి అన్నట్లు ‘ఈనాడు’లో వార్త వచ్చింది కదా?అని ప్రశ్నించగా.. ‘నేను అలా అన్నట్లు ఆధారం ఉందా? ఉంటే ఆడియో రికార్డులను బయటపెట్టండి. ఈనాడులో ఏదో రాసుకుంటే నేను ఏం చేయగలను?’ అని సమాధానం ఇచ్చారు. ఏపీఎన్జీఓ నేతకు, జర్నలిస్టు నేతకు టిక్కెట్లు అడిగినట్లు వచ్చిన వార్తల విషయమై ప్రస్తావించగా.. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారికి టికెట్లు ఇవ్వమని టీడీపీ, జై సమైక్యాంధ్ర పార్టీలను కోరామని జవాబిచ్చారు.
విభజనకు సహకరించే పార్టీలకు బుద్ధి చెప్పాలని తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరడంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలపై స్పందించే తీరునుబట్టి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. విభజనలో ఉద్యోగుల పంపిణీకి జరుగుతున్న కసరత్తు సీమాంధ్ర ఉద్యోగులను అసంతృప్తికి గురి చేస్తోందని చెప్పారు. రాజధాని ఎక్కడో తేల్చకుండా ఆప్షన్లు అడగడంలో అర్థం లేదన్నారు. విభనలో ఉద్యోగులకు అన్యాయం జరిగితే సమ్మె చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. ఓపెన్ కేటగిరీలో ఎంపికైన ఉద్యోగుల కు సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరించాలని ఆయన కోరారు.
ఆందోళన వద్దు: సీఎస్ హామీ
విభజనవల్ల ఉద్యోగులకు అన్యాయం జరగదని, సంప్రదాయాలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి సోమవారం తనను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందానికి చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై వారం రోజుల్లో మార్గదర్శకాలను ఖరారు చేయనుందని తెలిపారు. జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడారు. ‘విభజనవల్ల ఉద్యోగులకు అన్యాయం జరగదు. వారం రోజుల్లో మార్గదర్శకాలు ఖరారవుతాయి. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో అనురించిన సంప్రదాయాలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఉద్యోగులకు సొంత రాష్ట్రాలకు పంపించే విషయంలో కూడా అప్పుడు స్పష్టత వస్తుంది’ అని సీఎస్ చెప్పారన్నారు.