
బతుకు భారమై..
అప్పుల బాధ.. ఆపై వేధింపులు..
జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రైతు ఆత్మహత్య
‘వ్యవసాయం చేసుకోని బతుకుతామంటే అప్పులెక్కువైపోయినాయి.. యాడేగాని అప్పు పుట్టలేదు. ఈ ఊళ్లో బతకలేం..
మీ అమ్మోళ్ల ఊరికైనా పోయి ఏదో ఒక పనిచేసుకుని బతుకుదాం పా.. అంటూ భార్యా బిడ్డలను వెంటేసుకుని ఊరొదిలి వచ్చిన
ఆ బక్క రైతుకు కళ్లముందు కష్టాలే కనిపించాయి. అటు చూస్తే అప్పుల వాళ్లు.. ఇటు చూస్తే బిడ్డల ఆకలి.. చావే శరణ్యమనుకున్నాడు. ఇంటి నుంచి బయలుదేరిన ఆ రైతు భార్యా, బిడ్డలకు పుట్టెడు దుఃఖం మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
కడప అర్బన్:
జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం మధ్యాహ్నం ఎ.చలపతి (35) అనే రైతు విషపు గుళికలు నీటిలో కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంపై విరక్తితో ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. మైలవరం మండలం బుగ్గదాసరిపల్లెకు చెందిన అయ్యలప్పల గారి చలపతి తన భార్య సుబ్బమ్మ అలియాస్ సుబ్బక్కతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి పేరుతో ఉన్న ఐదెకరాల భూమిని సాగు చేసుకుంటూ మరోవైపు బేల్దారి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి భావన (11), హర్షవర్ధన్ (9) పిల్లలున్నారు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తామంటే ఇప్పటికే అప్పుల పాలయ్యానని, మళ్లీ పొలాన్ని సాగు చేసేందుకు అవసరమైన డబ్బును అప్పుగా తీసుకుందామంటే ఎవరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చే సేవాడు. ఈ పరిస్థితుల్లో బతుకు దెరువు కోసం తన భార్యా పిల్లలతో కలిసి తన అత్తగారి ఊరైన ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లెకు గత శనివారం వెళ్లాడు. అదే ఊరిలో బేల్దారి పనికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. సోమవారం ఉదయం తాను పల్లెకు వెళ్లి పిల్లల పుస్తకాలు, ఇంటి సామగ్రి తీసుకొస్తానని భార్య సుబ్బమ్మతో చెప్పి వచ్చాడు. తాను కలెక్టర్ పేరుతో రాసుకున్న అర్జీని తీసుకుని నేరుగా కడపలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చి విషపు గుళికలు నీటిలో కలిపి తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడి పోలీసులు గమనించి క్లూస్ టీం వాహనంలో రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాషా, ఎస్‌ఐ మైనుద్దీన్ రిమ్స్‌కు చేరుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు.
ఎస్‌ఐ మైనుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ చలపతి సోమవారం మధ్యాహ్నం కలెక్టర్, ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు హాజర య్యేందుకు వచ్చాడన్నారు. కానీ వారినెవరినీ కలవకుండానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలను సూసైడ్ నోట్‌లో రాశాడని తెలిపారు.
మృతుడి భార్య ఏమన్నారంటే!
ఈ సంఘటనపై చలపతి భార్య సుబ్బమ్మ అలియాస్ సుబ్బక్క విలేకరులతో మాట్లాడుతూ తన భర్త, పిల్లలు గత శనివారం అమ్మగారింటికి వెళ్లామన్నారు. తన భర్త ఊరిలో ఐదెకరాల పొలం సాగు చేసుకునేందుకు డబ్బులు కావాల్సి వచ్చి ఎవరినైనా అప్పు అడిగినా... ఇవ్వొద్దని వెంకటరాముడు అడ్డుపడేవాడని తెలిపారు. తాము ఇక్కడ బతకలేమని తన భర్త తరచూ అంటుండేవాడన్నారు. అందువల్లనే బతుకుదెరువు కోసం తమ పుట్టింటికి వెళ్లామన్నారు. ఊరికాడ పిల్లల పుస్తకాలు, ఇంటి సామగ్రి ఉందని, తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వచ్చిన తన భర్త తనకు దక్కకుండా పోయాడని విలపించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.