దిగొచ్చిన డీజిల్ ధర
ఒంగోలు: డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా తగ్గడంతో డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయని అందరూ ఊహించారు.అయితే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా పూర్తికావడంతో శనివారం ధరలు తగ్గిస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. జిల్లాలో మొత్తం 210 పెట్రోలు బంకులున్నాయి. వీటన్నింటి ద్వారా రోజుకు 13 లక్షల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. లీటరు డీజిల్ ప్రస్తుతం రూ.63.63గా ఉంది. దీనిపై వ్యాట్‌ను కలుపుకొని లీటరుకు రూ.4.12 తగ్గనుంది. శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చే ధర రూ.59.51గా ఉండనుంది. దీని ప్రకారం జిల్లాలోని డీజిల్ కొనుగోలుదారులకు రూ.53.56 లక్షల మేర ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీ రోజుకు జిల్లావ్యాప్తంగా 50 వేల లీటర్ల డీజిల్ కొనుగోలు చేస్తోంది. తగ్గిన ధరల ప్రకారం రూ.2.06 లక్షలు మిగలనున్నాయి.