విశాఖసిటీ: వేసవిలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు, వినోదయాత్రలకు వెళ్లారా? మరి రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కిలోమీటర్ల గురించి సూచించే మైలు రాళ్లు మీకు రోడ్డు పక్కనే కనిపించాయా..? వాటి మధ్య ఉన్న తేడాలు మీరు గుర్తించారా..? ఒక్కో రోడ్డులో ఒక్కో రంగుతో కూడిన మైలు రాయిలున్నాయి కదా. వాటి గురించి తెలుసుకుందామా మరి..
పచ్చరంగు ఉంటే..?
మైలు రాళ్లు పై భాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్ హైవేలు అని అర్థం. ఈ రోడ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తుంటాయి. వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది.
తెలుపు లేదా నలుపు రంగు ఉంటే?
మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే.. మనం ప్రయాణిస్తోంది పెద్ద నగరం మీదుగా లేదా జిల్లాలో అని అర్థం చేసుకోవాలి. ఈ రహదారుల్ని ఆయా నగరాలు లేదా జిల్లాల అభివృద్ధి శాఖలు పర్యవేక్షిస్తుంటాయి.
ఆరెంజ్ లేదా ఎరుపురంగు ఉంటే.?
మైలు రాళ్ల పై భాగంలో ఎరుపు లేదా ఆరెంజ్ రంగు ఉంటే మనం గ్రామాల్లో ప్రయాణిస్తున్నామని తెలుసుకొండి. అలాగే ఈ రోడ్లను ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించారని అర్థం.
పసుపు రంగు ఉంటే..?
ఇక మైలు రాళ్ల పైభాగంలో పసుపు రంగులో ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని జాతీయ రహదారులే ఉన్నాయి. వీటిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) పర్యవేక్షిస్తుంటుంది. మనం కేవలం ప్రయాణిస్తున్నప్పుడు మనం చేరుకోవాల్సిన గమ్యం ఎంత దూరం ఉందో చూశారు కదా.. ఈ సారి మాత్రం పైభాగం ఏ రంగులో ఉందో గమనించి.. రహదారుల మధ్య బేధాల్ని తెలుసుకొండి.
Comments
Please login to add a commentAdd a comment