డిజిటల్ ఏపీ
ప్రగతిపథంలో దూసుకెళ్తాం: సీఎం చంద్రబాబు
•{పతి ఇంటినీఇంటర్నెట్‌తో అనుసంధానిస్తాం
•జూలై ఆఖరుకు రాష్ట్రవ్యాప్తంగా సమీకృత డిజిటల్ సేవలు
•ఫైబర్ గ్రిడ్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం: సమాచార సాంకేతిక రంగాల్లో సృజనాత్మకత, నవకల్పనలతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ మొదటి దశను సీఎం చంద్రబాబు, సిస్కో సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టి.చాంబర్స్ గురువారం విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ-గవర్నెన్స్, ఈ-లెర్నింగ్, ఈ- మెడిసిన్ కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో దేశంలోనే మొదటి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించనుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సేవలను ఏకీకృత వ్యవస్థ పద్ధతిలో ప్రజలకు అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టు మొదటి దశలో ఏప్రిల్ చివరికి ఉత్తరాంధ్రలోనూ, జులై ఆఖరుకు రాష్ట్రంలో అన్ని ఇళ్లకు ఇంటర్నెట్, సమీకృత డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
డిజిటలైజేషన్‌కు రూ.4,700 కోట్లు అవుతుందని మొదట అంచనా వేశామని, కానీ అందుబాటులో ఉన్న విద్యుత్తు స్తంభాలను ఉపయోగించుకొని కేవలం రూ.330 కోట్లతోనే ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. డిజిటల్ ఏపీ కార్యక్రమంలో కంటెంట్ అభివృద్ధికి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సేవలను రూ.149కే అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. దీనికి ప్రత్యేకంగా డిజిటల్ సెటాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తామన్నారు. కార్యక్రమంలో సిస్కో సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టి.చాంబర్స్, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యన్నారాయణ, సిస్కో ఏసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఇర్విన్ టాన్, సిస్కో ఇండియా ప్రెసిడెంట్ దినేష్ మల్కాని తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ ఏపీ ప్రాజెక్టులో భాగస్వామిగా సిస్కో
డిజిటల్ ఏపీ ప్రాజెక్టులో భాగంగా అమెరికాకు చెందిన సిస్కో సిస్టమ్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వ, సిస్కో ప్రతి నిధులు గురువారం సంతకాలు చేశారు.
క్యాడ్‌బరీతో ‘కోకో’కు ప్రాధాన్యం: సీఎం
రాష్ట్రంలో క్యాడ్‌బరీ ప్లాంట్ ఏర్పాటుతో కోకో పంట సాగుకు ప్రాధాన్యం ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మాండల్స్ ఇంటర్నేషనల్ (క్యాడ్‌బరీ) కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘క్యాడ్‌బరీ’ విస్తరణ, అభివృద్ధి, ఉపాధి అవకాశాలను సంస్థ ప్రతి నిధులు సీఎంకు వివరించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో 134 ఎకరాల్లో రూ. 1,000 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ కర్మాగారం ఆసియా-పసిఫిక్‌లో అతిపెద్ద చాక్లెట్ కర్మాగారం అని వివరించారు. వచ్చే నెల 25న సంస్థ మొదటి దశ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా చంద్రబాబుని ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. సమావేశంలో క్యాడ్‌బరీ గ్రూప్ కంట్రీ హెడ్ వెంకటేశం చంద్రమౌళి, గవర్నమెంట్ సర్వీసెస్ హెడ్ అమిత్ కుమార్ సింగ్, సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. మలేసియా విధానాలు నాకు ఆదర్శం
మలేసియా మంత్రి లీవె షంగ్‌లైతో చంద్రబాబు
మలేసియా ప్రభుత్వం పరిపాలనలో అనుసరించే పారదర్శక విధానాలు తనకెంతో స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు చెప్పారు. మలేసియా రవాణా శాఖ మంత్రి లీవె షంగ్‌లై తన ప్రతినిధి బృందంతో గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పర్యాటక రంగంలో ఏపీతో కలసి పనిచేయడానికి మలేసియా సిద్ధంగా ఉందని లీవె చెప్పారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, పట్టణాభివృద్ధి, రవాణ రంగాల అభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బౌద్ధ టూరిజానికి ఏపీ ఒక కేంద్రంగా రూపొందుతుందని, ఒకనాడు బౌద్ధం విలసిల్లిన నేలపై ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు. మలేసియా ప్రతినిధి బృందం లో ఆ దేశ రవాణా శాఖ జనరల్ సెక్రటరీ సరిదుద్దీన్ ఖాసిం తదితరులున్నారు.