దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపు పర్వం మొదలైంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలలో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈరోజు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఆ తరువాత ఆయన పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి జానా రెడ్డిలను కూడా కలుస్తారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ పీసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశం గాంధీభవన్లో ప్రారంభమైంది. దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా టిఆర్ఎస్తో పొత్తు, అభ్యర్థుల ఎంపికపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. దిగ్విజయ్ సింగ్ మార్గదర్శకాలను సూచిస్తారు.