నాంపల్లి కోర్టులో తబ్రేజ్ ను హాజరుపరిచిన ఎన్‌ఐఏ
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. జంట పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్ ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకు వచ్చారు. ఢిల్లీ కోర్టు అనుమతి పొందిన ఎన్‌ఐఏ అధికారులు ఈరోజు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసులో యాసిన్ ,తబ్రేజ్‌ను ఎన్‌ఐఏ అధికారులు 15 రోజులు కస్టడీ కోరారు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్‌ఐఏ ఇప్పటికే భత్కల్, తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది.
కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్‌తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్న విషయం తెలిసిందే.