భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు: తబ్రేజ్
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు విచారణలో ఎన్ఐఏ పురోగతి సాధించింది. ఎన్ఐఏ విచారణలో అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ పలు కీలక విషయాలు వెల్లడించాడు. ప్రయివేట్ ట్రావెల్స్లో మంగళూరు నుంచి వచ్చి రెక్కీ నిర్వహించేవారని తెలిపాడు. అబిడ్స్, మలక్పేట, దిల్సుఖ్ నగర్లో రెక్కీ నిర్వహించినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. మంగళూరులోని యూనిట్ హెల్త్కేర్ వద్ద ఓ వ్యక్తి రియాజ్ భక్తల్ పేరుతో కొంత పేలుడు సామాగ్రిని అందచేశాడని చెప్పాడు.
అబ్దుల్లాపూర్మెట్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నామని, పేలుళ్లకు రెండు రోజుల ముందే బాంబులను పరీక్షించినట్లు పేర్కొన్నాడు. జుమారాత్బజార్, మలక్పేట్లలో పాత సైకిల్ విడిభాగాలు కొన్నామని... సేకరించిన విడిభాగాలతో రెండు సైకిళ్లు తయారు చేసినట్లు చెప్పాడు. పేలుళ్ల రోజు మలక్పేట రైల్వేస్టేషన్లో సైకిళ్లు ఉంచి, ఆ సైకిళ్లకు టిఫిన్ బాక్స్ బాంబులు అమర్చినట్లు అసదుల్లా అక్తర్ తెలిపాడు.
దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్ద ఓ సైకిల్ను వాఖత్ ఉంచగా, A1 మిర్చి సెంటర్ వద్ద తహసీన్ మరో సైకిల్ ఉంచినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. రియాజ్ భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు జరిగాయని, పేలుళ్లు జరిగిన రోజే బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలిపాడు. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లి అక్కడ నుంచి నేపాల్ చేరుకున్నట్లు చెప్పాడు.