ఒంగోలు సెంట్రల్: వికలాంగులకు వైకల్య శాతం ఎంత ఉందో ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసిన సదరమ్ నరకంగా మారింది. తిరగలేరని తెలిసినా మానవత్వం లేకుండా ఏళ్ల తరబడి తిప్పుతూనే ఉన్నారు. ఈ కష్టం జిల్లా అధికారులకు తెలిసినా చూసీచూడనట్టుగా ప్రవర్తిస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు.
సదరమ్ ప్రారంభ ం నుంచి నేటికీ ధ్రువీకరణ పత్రాలు అందని వికలాంగులు జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది ఉన్నారు. వీటిలో ఫొటోలు తప్పుగా ఉన్నవి 262 వరకూ ఉన్నాయి. మరో రెండు వందల వరకూ అప్పట్లో సదరమ్ క్యాంప్‌లలో పాల్గొన్న ఇద్దరు ఆర్ధోపెడిక్ వైద్యులు వికలాంగులపై కనికరించకపోవడంతో సంతకాలు కాలేదు.
దీంతో వీరిని మరలా సదరమ్ క్యాంప్‌లో పరీక్షించుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. పేర్లు తప్పు పడినవి 400 వరకూ ఉన్నాయి. మిగిలినవి ఇతర కారణాలతో ఆగిపోయాయి. అయితే వీటిపై అధికారులు దృష్టి కేంద్రీకరించలేదు. మొదటి విడత సదరమ్ శిబిరానికి, రెండోదానికి మధ్య సంవత్సరం గడువున్నా దరఖాస్తులు మాత్రం అలాగే మగ్గిపోతున్నాయి.
హామీ ఇలా:
వికలాంగులను పరీక్షించే సమయంలో పది రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు నరకం ఎంపీడీఓల ద్వారా మీ మండలాల్లోనే అందజేస్తారని అధికారులు ఇచ్చిన హామీలు ఆచరణలో చతికిలపడ్డాయి. నెలలు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క పత్రం కూడా వికలాంగులకు అందలేదు.
సదరం ఉద్దేశ్యమిదీ...
వికలాంగులకు వైకల్యశాతం గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడ మే ముఖ్య ఉధ్దేశ్యంగా 2010 జూన్ 2న కోటీ ఏభై లక్షలతో సదరం కార్యాలయాన్ని ఒంగోలులో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వికలాంగులను పరీక్షించిన రోజే సాయంత్రంలోపు ద్రువీకరణ పత్రం అందించాలి. అయితే పరీక్షలు చేయించుకున్న వికలాంగులకు సంవత్సరాలు గడుస్తున్నా ధ్రుపత్రాలు మాత్రం అందడం లేదు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నమోదులో అనేక తప్పులు దొర్లుతున్నాయి. దీంతో వీటిని సరిచేయించుకోవడానికి వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సమస్యల వలయం
సదరమ్ కార్యాలయంలో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు అటెండర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ వికలాంగులకు కనీసం సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఫొన్ చేస్తే ఎత్తి పక్కన పెట్టేస్తుంటారు. దీంతో జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా కష్టనష్టాలకు ఓర్చి ఒంగోలుకు వచ్చి పాత రిమ్స్‌లో ఉన్న సదరమ్ కార్యాలయానికి తిరుగుతున్నారు.
పెండింగ్‌లో ఉన్న ధ్రువీకరణ పత్రాలకు జత చేయాల్సిన అనుబంధ పత్రాలు ఒకేసారి చెప్పకపోవడంతో నరకం చవిచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఓ వికలాంగురాలు తన ఇక్కట్లను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి పీఏ సదరమ్ కార్యాలయానికి ఫొన్ చేస్తే సిబ్బందిలో చలనం కలిగి రెండు సంవత్సరాల నుంచి వారి వద్ద మగ్గుతున్న ధ్రువీకరణ పత్రానికి మోక్షం కలిగింది.
వసతుల లేమి
సదరమ్ తాత్కాలిక శిబిరాన్ని రిమ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పరీక్షల కోసం రోజుకు 500 మందికిపైగా వికలాంగులు జిల్లా నలుమూలల నుంచి వస్తున్నారు. అధికారులు వీరి కోసం ఏర్పాట్లు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. కేవలం ఒకే టెంట్ మాత్రమే వేశారు. దీంతో ఎక్కువ మంది వికలాంగులు ఎండలోనే ఉండాల్సి వస్తోంది. వికలాంగులకు సహాయం చేసేందుకు ఎవరినీ నియమించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ చిన్నారిని చూసైనా కనికరం లేదాయే..
చిలకల రాజేష్ (6).
ముండ్లమూరుకు చెందిన చిలకల రాజేష్ అనే బాలుడు పుట్టినప్పటి నుంచి కేవలం రెండున్నర అడుగులు మాత్రమే పొడవు పెరిగాడు. ఈయన తలలోకి నీరు చేరడంతో ఎదుగుదల లేదని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు వెల్లడించారు. అయితే ధ్రువీకరణ పత్రం కోసం ఇప్పటికి నాలుగు సార్లు రిమ్స్‌కు వచ్చినా పని కాలేదని, వచ్చినప్పుడంతా రూ. 500లు ఖర్చు అవుతుందని బిడ్డ తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఈ చిన్నారిని చూసైనా కనికరం లేదాయే పాలకు వక్కయ్య
పాలకు వక్కయ్యకు కరెంటు షాక్‌తో రెండు కాళ్లు, చేతులు తీవ్రంగా గాయాలయ్యాయి. పని చేయలేని స్దితిలో ఉన్నాడు. వికలాంగ ధ్రువీకరణ పత్రం ఉంటే పెన్షన్ వస్తుందనే ఆశతో గత సంవత్సరం దర్శిలో జరిగిన క్యాంప్‌లో పాల్గొని పరీక్షించుకున్నా పత్రం రాలేదు. మళ్లీ ఇప్పుడు రిమ్స్‌కు వచ్చినా అదే దుస్థితి నెలకుంది.
ఏడాదైనా అందని ధ్రువీకరణ పత్రం
Published Tue, Sep 30 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement