సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో అధికారుల బదిలీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులపై ఆ పార్టీ నేతలే ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సహజంగా బది‘లీలల’పై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తాయి. ముడుపులు తీసుకుని నచ్చినవారికి పోస్టింగ్‌లిచ్చారని మండిపడతాయి. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పుడు అధికార పక్షమే విపక్షంగా తయారైంది.
వారి మధ్య నెలకొన్న అంతర్గత పోరు బదిలీల వ్యవహారంతో తారస్థాయికి చేరింది. తనను వ్యతిరేకిస్తున్న నేతలు సిఫారసు చేసిన అధికారులకు పోస్టింగ్‌లిస్తే భవిష్యత్‌లో ముప్పు వస్తుందనే ఉద్దేశంతో మంత్రి తన పవర్‌ను ఉపయోగించి వాటిని నిలిపివేశారు. అయితే తాము సూచించిన వారి పేర్లను కనీసం పరిశీలించలేదన్న ఆవేదనతో పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి మృణాళిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియలో చేతులు మారిన ముడుపులు, ఇతరత్రా వ్యవహారాలన్నీ బయట పెడుతున్నారు. కొందరైతే ఏకంగా మంత్రిని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. గత ప్రభుత్వ పెద్దలతో కుమ్మకై అప్పట్లో హవా సాగించిన అధికారులను తీసుకొచ్చి పరోక్షంగా సహకరించారన్న వాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. మరికొందరైతే సత్తిబాబు టీమ్‌ను తెచ్చారని బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ మధ్య జెడ్పీ గెస్ట్ హౌస్‌లో రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశామని, ఇప్పుడేకంగా బహిరంగ పోరుకు సన్నద్ధమని సవాల్ విసురుతున్నారు. మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి వాదులంతా ఒక్కటవుతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాకొచ్చిన అధికారులెవరు? గతంలో వారి పనితీరు? వారిపై ఉన్న ఆరోపణలు? ఎవరికి అనుకూలంగా వ్యవహరించారు ? తదితర వివరాలను సేకరించి తొలుత అశోక్ గజపతిరాజు వద్ద పెడతామని, ఆ తర్వాత సీఎం వద్ద పంచాయతీ (పంచాయితీ) పెడతామని చెబుతున్నారు. ఇంక వేచి చూడలేమని, ఏదోకటి తేల్చుకుంటామని అంటున్నారు. ఇదెంతవరకు వెళ్తుందో? లేదంటే మేకపోతూ గాంభీర్యంగా మిగిలిపోతుందో వేచి చూడాలి.
బదిలీలపై అసమ్మతి సెగలు
Published Sat, Nov 15 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement