ఇక మరిచిపోదాం..!
హైకోర్టు కార్యకలాపాలకు భంగం కలిగించిన కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య
రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక
మళ్లీ ఆ విషయం ఎందుకు?
కేసీఆర్, కేటీఆర్, ఈటెల, నాయిని, కవిత తదితరులపై కేసుల కొట్టివేత
న్యూఢిల్లీ: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగి కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఘటనపై దాఖలైన కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2010 సెప్టెంబరు 13వతేదీ నుంచి 16వ తేదీ వరకు తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని... వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య, మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ అదే ఏడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆందోళనలో పాలుపంచుకున్నారంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు(ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి), పార్టీ నేతలు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, కె.తారక రామారావు, కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీలు మధుయాష్కీ, విజయశాంతితోపాటు పలువురు తెలంగాణ న్యాయవాదులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పలుసార్లు విచారణకు వచ్చిన ఈ కేసు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. సోమవారం జరిపిన తుది విచారణలో కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని మళ్లీ మనం ఎందుకు ఎత్తుకోవాలి. న్యాయవాదులు మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడబోరని విశ్వసిస్తూ ఈ విషయాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నిద్దాం..’ అని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఇకపై ఇలాంటి చర్యలకు దిగబోమని ప్రతివాదులు ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి గుర్తు చేసింది.
పలు కేసుల కొట్టివేత
మరోవైపు కొందరు న్యాయవాదులు సకలజనుల సమ్మె సందర్భంగా న్యాయమూర్తులతో, ఆంధ్రాకు చెందిన న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించారంటూ దాఖలైన పిటిషన్‌పైనా ఇదే ఉత్తర్వులు ఇచ్చింది.