మోసకారి కానిస్టేబుల్ అరెస్టు
Published Tue, Oct 29 2013 2:11 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ :ఇద్దరు యువతులను ప్రేమ పేరిట మోసగించి పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఓ యువతి తల్లిదండ్రులపై అట్రాసిటీ కేసు పెట్టించిన కానిస్టేబుల్‌ను సోమవారం అరెస్టు చేసి, విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ బీవీ రమణకుమార్ తెలిపారు. స్థానిక నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ శిబిరంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.. మంగళగిరికి చెందిన ఎం.అశోక్‌ప్రభాకర్ 2011లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. రూరల్ జిల్లా నుంచి అటాచ్‌మెంట్‌లో అర్బన్ జిల్లా ఏఎన్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు. గుంటూరు నగరంలోని గాజులవారితోటకు చెందిన ఓ యువతిని ప్రేమించి గతేడాది జూలై 28న విజయవాడ దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నాడు.
ఆ యువతి ఇంట్లోనే ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. ఈక్రమంలో సంగడిగుంటకు చెందిన మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. ఆ యువతిని కూడా ఈ ఏడాది జూలై 27న విజయవాడలో వివాహం చేసుకుని మంగళగిరిలోని తన నివాసంలో కాపురం పెట్టాడు. ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలిసి మంగళగిరి వెళ్లి కానిస్టేబుల్ అశోక్‌ప్రభాకర్‌ను నిలదీశారు. వారి పట్ల దురుసుగా వ్యవహరించడమేకాకుండా దుర్భాషలాడి పంపించివేశాడు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషించడంతోపాటు తనపై, తన తల్లిపై దాడికి పాల్పడ్డారంటూ వారిపై మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు.
తన తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించడమేకాకుండా, పెళ్లయిన నెలరోజులకే కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులకు దిగడంతో ఆమె సంగడిగుంటలోని పుట్టింటికి చేరింది. బాధితురాలు లాలాపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అశోక్‌ప్రభాకర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఉద్దేశపూర్వకంగా అట్రాసిటీ కేసు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న మొదటి భార్య నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో అశోక్‌ప్రభాకర్ ఇద్దరు యువతులను వివాహం చేసుకుని మోసం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు నిందితుడు అశోక్‌ప్రభాకర్‌ను అరెస్టుచేశారు. విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు అర్బన్ ఎస్పీ వెల్లడించారు. అశోక్‌ప్రభాకర్ తల్లి మేరిరోజమ్మ, బంధువులు అర్బన్ ఎస్పీని కలిసి సంగడిగుంటకు చెందిన యువతినే ప్రేమ వివాహం చేసుకున్నాడని, అంతకుముందు ఎలాంటి వివాహం జరగలేదని వివరించారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే కేసు బనాయించారు..
రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు తనపై అక్రమ కేసు బనాయించారని కానిస్టేబుల్ అశోక్‌ప్రభాకర్ విలేకరులకు తెలిపాడు. నిష్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని ఎస్పీని కలిసి కోరాడు. కేసు దర్యాప్తులో ఉన్నందువల్ల తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని, వాస్తవాలకనుగుణంగానే చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.
Advertisement
Advertisement