‘ఎస్పీగా జిల్లాలో విధులు నిర్వర్తించడం నాకె ంతో సంతోషాన్నిచ్చింది. జిల్లాతో అనుబంధం మరువలేను. స్వర్గీయ ఉమేష్‌చంద్ర, అరవిందరావు, గోవింద్‌సింగ్, ఠాకూర్ లాంటి పోలీసు ఉన్నతాధికారులు పనిచేసిన జిల్లాలో విధులు నిర్వర్తించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ తన మనసులోని మాటలను సిబ్బందితో పంచుకున్నారు.
కడప అర్బన్ : ఎస్పీగా జిల్లాలో విధులు నిర్వర్తించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని, జిల్లాతో అనుబంధాన్ని మరువలేనని, బదిలీపై వెళుతున్న ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఉమేష్‌చంద్ర స్మారక కల్యాణమండపంలో పోలీసు అధికారులు ఎస్పీ అశోక్‌కుమార్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలోని అన్ని జిల్లాలతో తనకు అనుబంధముందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు దాదాపు 80 నుంచి 100 మంది బాధితులు వచ్చి తనను కలిసేవారని, వారందరికీ న్యాయం జరిగేలా చూశానన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలను నేరుగా కలవాలని, వారి సమస్యలను సావధానంగా వినాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంచే మరిన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
స్వర్గీయ ఉమేష్‌చంద్ర, అరవిందరావు, గోవింద్‌సింగ్, ఠాకూర్ లాంటి పోలీసు ఉన్నతాధికారులు పనిచేసిన జిల్లాలో విధులు నిర్వర్తించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు సహకరించిన అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఎస్పీ అడ్మిన్ టి.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎస్పీ అశోక్‌కుమార్ బాధ్యతలను ఛాలెంజ్‌గా తీసుకొని విధులు నిర్వర్తించారన్నారు. జమ్మలమడుగు ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ విధి నిర్వహణతోపాటు కుటుంబానికి దగ్గరగా ఉండాలనిఎస్పీ అశోక్‌కుమార్ చెప్పేవారని గుర్తు చేశారు.
పొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలు, వరుస ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టి విజయవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి,కడప అర్బన్ సీఐ శ్రీనివాసులు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ తదితరులు మాట్లాడుతూ ఒకవైపు శాంతి భద్రతలు పరిరక్షిస్తూ మరోవైపు పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు.
జిల్లాతో అనుబంధం మరువలేను
Published Sun, Jul 27 2014 2:14 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement