జిల్లా కేంద్రంలో రాష్ట్ర పోలీసు అకాడమీ..?
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : డీఎస్పీ, ఎస్సై స్థాయి పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ(అప్పా)తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వెళుతుంది. దీంతో సీమాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు అకాడమీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ అకాడమీని విజయనగరంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దీనికి పట్టణంలో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రం అనువైనదిగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు భావించినట్లుగా తెలిసింది. పోలీసు శిక్షణ కేంద్రానికి గతంలో సుమారు 127 ఎకరాలు వరకు భూమిని కేటాయించారు. పోలీసు శిక్షణ కేంద్రం, మైదానం, జిల్లా పోలీసు కార్యాలయం, పోలీసు క్వార్టర్స్ తదితరాలను కలుపుకొని 87 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ స్థలం అన్నిరకాల పోలీసు శిక్షణా కార్యక్రమాలకు సరిపోతుందన్న భావనతో ఇక్కడ అకాడమీని ఏర్పాటుచేసేందుకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ ఎంత స్థలం ఉంది తదితర వివరాలను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలుసుకున్నట్లు తెలిసింది.