ఇదేం యాపారం!
కరవమంటే కప్పకు..విడవమంటే పాముకు.. అన్నట్లు తయారైంది డీసీఎంఎస్ (జిల్లా మార్కెటింగ్ సొసైటీ)అధికారుల పరిస్థితి. అసలే డీసీఎంఎస్ సంక్షోభంలో ఉంది. ఆదాయం సమకూరే కార్యకలాపాలు, ఆర్థిక సామర్థ్యం లేకపోవడం వల్ల పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డీసీఎంఎస్‌ది. ఈ నేపథ్యంలో దాన్ని ఎలాగైనా బతికించాలని వివిధ ప్రభుత్వ సంస్థలకు సరుకులు సరఫరా చేసే బాధ్యతలను టెండర్ల ద్వారా ప్రభుత్వాలు అప్పగిస్తూ వస్తున్నాయి.
అయితే, ఆ స్థాయి పెట్టుబడి లేకపోవడంతో డీసీఎంఎస్ తిరిగి సబ్ కాంట్రాక్ట్ ఇస్తోంది. దీని ముసుగులో అధికారంలో ఉన్న నేతలు ప్రవేశిస్తున్నారు. తమ అనుకూల వ్యక్తుల్ని సబ్ కాంట్రాక్టర్‌లుగా వేయిస్తున్నారు. అదే పనిగా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సరుకుల సరఫరా బాధ్యత పంపకాలు చేయలేక అధికారులు ఇరకాటంలో పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సరుకుల సరఫరా కాంట్రాక్ట్ విషయంలో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది. డీసీఎంఎస్‌కు మేలు చేద్దామని టెండర్ల ద్వారా అప్పగిస్తున్నా అదికాస్త ప్రైవేటు వ్యక్తులకు మేలు చేకూరుస్తోంది. డీసీఎంఎస్‌కు వచ్చే ప్రయోజనం కన్నా దళారి వ్యాపారులకొచ్చే లాభం ఎక్కువైపోతోంది. అదే ఆశతో మరికొందరు వ్యాపారులు ఎగబడడంతో డీసీఎంఎస్ అధికారులు నలిగిపోతున్నారు. కమీషన్ల కోసం అధికార పార్టీ నాయకులు, లాభాల కోసం దళారీ వ్యాపారులు పైన పడడంతో డీసీఎంఎస్‌కు అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడింది.
డీసీఎంఎస్ ద్వారా ఏటా ఐసీడీఎస్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సరుకులను సరఫరా చేస్తున్నారు. టెండర్ల ద్వారా సరుకుల సరఫరా కాంట్రాక్ట్ దక్కినా ఆ సరఫరా బాధ్యతను డీసీఎంఎస్ మరో ప్రైవేటు ట్రేడర్స్‌కు అప్పగిస్తోంది.అయితే, ప్రైవేటు ట్రేడర్స్ ఎంపిక అధికారుల ప్రమేయం లేకుండా నేతల సిఫారసుల మేరకు జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చెప్పిన వారికి, ప్రస్తుతం టీడీపీ నేతలు సూచించిన వారికి కట్టబెడుతున్న పరిస్థితి దాపురించింది.
టీడీపీ అధికారంలోకి రాక ముందు వరకు ఐసీడీఎస్ సరుకుల సరఫరా సబ్ కాంట్రాక్ట్ బాధ్యతలను విశాఖపట్నానికి చెందిన సుబ్రహ్మణ్యం ట్రేడర్స్ నిర్వహిస్తూ వచ్చింది. ఈ ఏడాది జూన్‌తో వారి కాంట్రాక్ట్ ముగిసింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు రంగ ప్రవేశం చేశారు. ఐసీడీఎస్ సబ్ కాంట్రాక్ట్‌తో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు,రెసిడెన్షియల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సరుకులు సరఫరా చేసే సబ్ కాంట్రాక్ట్‌పైనా కన్నేశారు. ఇప్పటికే హాస్టల్స్‌కు సంబంధించి కనకమహలక్ష్మీ గ్రౌండ్‌నట్ అండ్ ఆయిల్ మిల్లు, శివ పద్మావతి ట్రేడర్స్ సబ్ కాంట్రాక్ట్‌గా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతల సిఫారసు మేరకు హరిపద్మ ట్రేడర్స్ రంగంలోకి దిగింది. దీంతో డీసీఎంఎస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. పాత వారిని రద్దు చేస్తే న్యాయపరమైన చిక్కులొస్తాయని, వారితో మాట్లాడుకుని సర్దుకుపోవాలని సూచించడంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఐసీడీఎస్ సబ్ కాంట్రాక్ట్‌ను కనకమహలక్ష్మీ గ్రౌండ్ నట్ అండ్ అయిల్ కంపెనీకి, కే.ఎల్.ఎన్.ట్రేడర్స్‌కిచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే వివిధ శాఖల హాస్టల్స్, విద్యాలయాలు, రెసిడెన్సియల్ స్కూల్స్‌కు సరఫరా చేసే సబ్ కాంట్రాక్ట్ బాధ్యతలను కనకమహలక్ష్మీ గ్రౌండ్‌నట్ అండ్ ఆయిల్ కంపెనీ, శివ పద్మావతి ట్రేడర్స్‌తో పాటు హరిపద్మ ట్రేడర్స్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఐసీడీఎస్ సరుకుల సరఫరాపై ఆరోపణలు వెల్లువెత్తడంతో డీసీఎంఎస్ సరుకుల సరఫరా కాంట్రాక్ట్‌ను రద్దు చేసి టెండర్లు పిలవాలని కలెక్టర్ నిర్ణయించారు. ఆమేరకు డీసీఎంఎస్ కూడా తమ సబ్ కాంట్రాక్ట్‌గా ఉన్న కనకమహలక్ష్మీ గ్రౌండ్‌నట్ అండ్ ఆయిల్ కంపెనీ, కేఎల్‌ఎన్ ట్రేడర్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. మార్చి వరకు ఒప్పందం ఉండి మధ్యలో రద్దు చేయడమేంటని సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తర్వు లొచ్చాయి.
పై రెండు సంస్థలకు సరుకులు సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విధంగా కొనసాగుతున్న సబ్ కాంట్రాక్ట్‌లపై టీడీపీ నేతలకు సన్నిహితంగా ఉన్న మరికొన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. ఒక్కొక్కరు ఎగబడడంతో డీసీఎంఎస్ అధికారుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఇటువంటి ఇబ్బందులేవీ ఎదురు కాకుండా ఉండాలంటే డీసీఎంఎస్సే తమకొచ్చిన కాంట్రాక్ట్ మేరకు నేరుగా సరుకుల సరఫరా చేసే బాధ్యతను చేపట్టాలి. అందుకు తగ్గ పెట్టుబడిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.