ఏజెన్సీలోప్రకంపనలు | district police alert with Chhattisgarh event | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలోప్రకంపనలు

Published Wed, Mar 12 2014 2:03 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

district police alert with Chhattisgarh event

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల వేళ మావోయిస్టు కార్యకలాపాలు ఉధృతమవుతుండడం జిల్లా పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది.  దాదాపు రెండు నెలల కాలంలోనే మూడు ఎన్నికలను నిర్వహించాల్సిన తరుణంలో మావోయిస్టులు ఒకదానిపై ఒకటిగా వరుసగా పోలీసులకు షాకులిస్తున్నారు. ఇటీవలే జిల్లాలో ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చడం, పట్టపగలే భద్రాచలంలో పోస్టర్లు వేయడం లాంటి ఘటనల తర్వాత.... సీపీఎం నాయకుడు ముత్యంను హతమార్చిన మరుసటి రోజే ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 15 మంది పోలీసులను  మావోయిస్టులు చంపడంతో జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 రాజకీయం... భయం భయం
 త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఏదో ఒక సంఘటనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారని నిఘావర్గాలంటున్నాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తమ వ్యూహాలకు పదును పెడుతున్న రాజకీయ నేతల్లో కూడా ఈ పరిణామాలు భయం పుట్టిస్తున్నాయి.

 ఏజెన్సీ ప్రాంతంలో పోటీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో.. నిలబడ్డ అభ్యర్థులు ప్రచారానికి వెళితే ఏం జరుగుతుందోననే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. మరోవైపు అటవీప్రాంత గ్రామాల్లోకి ప్రచారం నిమిత్తం వెళ్లే రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం కూడా పోలీసులకు పెద్ద సవాల్‌గా మారనుంది. ప్రచారంలో భాగంగా  పోలీసులకు సరైన వివరాలు తెలపకుండా అటవీప్రాంత గ్రామాల్లోకి వెళ్లవద్దని నాయకులకు చెపుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందనేది అనుమానమే.  కాగా, మావోయిస్టుల వరుస దాడులతో అప్రమత్తమైన పోలీసులు సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను మోహరించారు.

 ఛత్తీస్‌గఢ్ ఘటనతో ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. జిల్లాలోని చింతూరు మండల కేంద్రానికి ఘటనస్థలం సుమారు 150కిలో మీటర్‌ల దూరంలోనే ఉండటంతో  కూంబింగ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల కూంబింగ్ ఆపరేషన్‌ల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందోనని సరిహద్దు ప్రాంతంలోని గిరిజను లు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

 మూడునెలల క్రితమే వ్యూహం
 ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో గత డిసెంబర్ నెలాఖరులో మావోయిస్టుల కీలక సమావేశం జరిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి వివరాలను సేకరించిన కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఛత్తీస్‌గఢ్-ఒడిశా దండకారణ్యానికి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ అగ్ర నేతలు, మిలటరీ ప్లాటూన్ కమిటీల కార్యదర్శులు దండకారణ్యంలోని గర్యబంద్ అటవీ ప్రాంతంలో కీలక సమావేశం నిర్వహించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈసమావేశంలో ముఖ్యంగా 2014లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయంతో పాటు దండకారణ్య ప్రజలకు మరింత దగ్గరగా ఎలా వెళ్లాలనే దానిపై వ్యూహరచన చేసినట్లు సమాచారం.

 ఇదిలా ఉండగా పీపుల్స్‌వార్ తదితర సంఘాలతో విలీనమై మావోయిస్టులుగా అవతరించి 10 సంవత్సరాలు కావడంతో 10వ వార్షికోత్సవాలను దండకారణ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలనే దానిపై చర్చలు జరిపారు. దండకారణ్యంలోని ప్రతీ ఆదివాసీ గ్రామాలలో దళ,మిలీషియా,గ్రామ కమిటీ సభ్యులు విధిగా పాల్గొని వారోత్సవాలను ఘనంగా నిర్వహించే విదంగా చర్యలు చేపట్టాలని స్పెషల్ జోనల్ కమిటీ తీర్మానించినట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాలలోని యువతీ ,యువకులను అధిక శాతంలో రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మిలటరీ ప్లాటూన్‌లో సభ్యులు తక్కువగా ఉండడంతో పాటు ఆయుధాలు ఇతర సామగ్రి తక్కువగా ఉన్నాయని సమావేశంలో మిలటరీ కార్యదర్శులు స్పెషల్ జోన్ కమిటీ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.

 అందులోభాగంగానే ఇటీవల రిక్రూట్‌మెంట్ ప్రారంభించారని, కొత్తగా పార్టీలో రిక్రూట్ అయిన వారే పట్టపగలు భద్రాచలంలో పోస్టర్లు వేయడం, సీపీఎం నేతను హత్య చేసిన ఘటనలో పాల్గొన్నారని తెలుస్తోంది. మరోవైపు నరేశ్ ఎన్‌కౌంటర్ తర్వాత స్తబ్దుగా ఉన్న శబరి ఏరియా కమిటీ కూడా క్రియాశీలమవుతోందని, కొరియర్ వ్యవస్థను మా వోయిస్టులు ఎక్కడికక్కడ బలోపేతం చేసుకుం టున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఎన్నికయిన సంతో ష్ స్వయంగా ఆపరేషన్లలో పాల్గొంటున్నారని కూడా పోలీసు వర్గాల వద్ద సమాచారం ఉంది.

 డీ ఐజీతో ఎస్పీ భేటీ : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన  ఘటనతో జిల్లాలో రెడ్  ఎలర్ట్ ప్రకటించినట్టయింది. ఛత్తీస్‌గఢ్ ఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ ఎ.వి.రంగనాథ్ అక్కడి పోలీసులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్థానిక పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్‌బి సమావేశ మందిరంలో జ్యూయలరీ షాపుల యాజమానులతో ఏర్పాటు చేసిన సమావేశానికి రావలసి ఉన్నా ఎస్పీ హాజరుకాలేదు. ఘటన జరిగిన సమయంలో కొత్తగూడెంలో ఉన్న ఆయన ఆ తర్వాత వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావుతో భేటీ అయ్యారు. ఛత్తీస్‌గఢ్ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు అనుసరించాల్సిన వ్యూహంపై వీరిరువురి చాలా సేపు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement