నో డౌట్... ఇది సొంత ఇంట్రస్ట్! | District there is a government medical college yogam | Sakshi
Sakshi News home page

నో డౌట్... ఇది సొంత ఇంట్రస్ట్!

Published Tue, Sep 2 2014 2:34 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

నో డౌట్...  ఇది సొంత ఇంట్రస్ట్! - Sakshi

నో డౌట్... ఇది సొంత ఇంట్రస్ట్!

గురజాడ అప్పారావు ‘సొంత లాభం కొంతమానుకోమని’ ఉద్బోధిస్తే ఆయన వారసులుగా చెప్పుకొనే జిల్లా నేతలు సొంత  ఇం‘ట్రస్ట్’ మాకు ముఖ్యమంటూ జిల్లాకు ఏకంగా ప్రభుత్వ వైద్యకళాశాల రాకుండా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలను నిర్వహిస్తే తక్కు వ ఫీజులతో వైద్య విద్య అభ్యసించవచ్చన్న జిల్లా విద్యార్థుల ఆశలను అడియాసలు చేస్తూ ఓ ట్రస్ట్‌కు కళాశాలను కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి జిల్లాలో కొందరు టీడీపీ నేతలే కార ణమని, వారే ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కాకుండా మోకాలు అడ్డుపెట్టినట్టు భోగట్టా....
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల యోగం లేనట్టే. ప్రైవేటువైపే సర్కార్ మొగ్గు చూపుతోంది. టీడీపీ కీలక నేతలు చేస్తున్న తెర వెనుక ప్రయత్నాలతో మంత్రి మృణాళిని ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా పక్కకు వెళ్లిపోయింది. విజయనగరానికి చెందిన ఓ ట్రస్టుకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. దీంతో ప్రభుత్వ వైద్య విద్య జిల్లా విద్యార్థులకు అందని ద్రాక్షగా మారనుంది. స్థోమతుంటే లక్షలాది రూపాయల ఫీజులతో చదువు‘కొనా’లి. లేదంటే వైద్య విద్య అభ్యసించలేని పరిస్థితి ఏర్పడనుంది. జిల్లాకొక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని మేనిపెస్టోలో టీడీపీ పేర్కొంది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ప్ర  భుత్వ వైద్య కళాశాలల్లేని విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈసారి ఏర్పాటు చేయడం ఖాయమని అంతా భావించారు.
 
 అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని కూడా   మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టరేట్(డీఎంఈ)కు  రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో డీఎంఈ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు సరిపడా 25 ఎకరాలను విజయనగరం పట్టణంలో ఘోషా ఆస్పత్రి, పెద్దాస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు ఆ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అలాగే రూ.400 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనల నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే, తెరవెనుక వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో చంద్రబాబు ఆ  ప్రతిపాదనను తిరిస్కరించినట్టు తెలిసింది. సర్కార్ కళాశాల కన్నా ప్రైవేటు కళాశాలైతే బాగుంటుందని సంబంధిత అధికారులకు సూచించినట్టు తెలియవచ్చింది. దీంతో డీఎంఈ అధికారులు మరో మాట మాట్లాడకుండా   వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఈ విషయంలో మంత్రి మృణాళి మాట కూడా  చెల్లుబాటుకాలేదని సమాచారం.
 
 చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగే జిల్లా కీలక నేతలు లోపాయికారీగా చేసిన ప్రయత్నాలతోనే సర్కార్ కళాశాల ప్రతిపాదనలను చంద్రబాబు  తిరస్కరించినట్టు తెలుస్తోంది. తమకు ఇప్పటికే అనేక విద్యా సంస్థలు ఉన్నాయని, దీన్ని కూడా ఇచ్చేస్తే మరింత పటిష్టమవుతుందని  ట్రస్ట్ యాజమాన్యం, టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో అధినేత తలొగ్గినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో  రూ.400కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదన్న కారణాన్ని సాకుగా చూపించి కీలక నేతలకు సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.    
 
 ప్రైవేటే దిక్కు
 జిల్లాలో ఇప్పటికే ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉంది. తాజాగా వస్తున్న రెండోది ప్రైవేటుకే కట్టబెడుతుండడం తో ప్రభుత్వ  వైద్య కళాశాల కు జిల్లా దూరమయ్యే పరి స్థితి ఏర్పడనుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్లడంతో స్థోమత ఉన్న  విద్యార్థులకే చదివే అవకాశం ఉంటుం ది.   పేదవిద్యార్థులు ఎప్పటిలాగే ఆశలు వదులుకోవల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని ఐదు జిల్లాల విద్యార్థుల కోసం 85 శాతం సీట్లు కేటాయిస్తారు. దీంతో లోకల్ కింద ఎక్కవ మందికి సీట్లొస్తాయి.
 
  అదే ప్రైవేటు యాజమాన్యమైతే ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. అలాగే సర్కార్ కళాశాలలో రూ.10వేల ఫీజుకే వైద్య వైద్యను చదువుకోవచ్చు. ప్రైవేటు కళాశాలైతే ఏ కేటగిరీలో రూ.60వేలు, బీ కేటగిరిలో రూ.2.40 లక్షలు, సీ కేటగిరిలో రూ.5.50 లక్షల వ రకూ ఫీజులు చెల్లించవలసి వస్తుంది. ఇక యాజమాన్యం కోటా కిందైతే చెప్పనక్కర్లేదు.  మొత్తానికి  పక్కనున్న శ్రీకాకుళంలోనూ, పొరుగునున్న విశాఖలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలుంటే విజయనగరం జిల్లాలో ప్రైవేటే ముద్దు అని కీలక నేతలు ఆరాటపడుతున్నారు. దీంతో జిల్లాకొచ్చే మంచి అవకాశాన్ని  కోల్పోయేపరిస్థితి ఏర్పడింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement