ఏడాదిగా ఇక్కడే ఉన్న గోవిందయాదవ్
జార్ఖండ్ పోలీసుల అప్రమత్తతతో అరెస్టు
జిల్లా పోలీసు నిఘా ఎక్కడ?
చిత్తూరు (అర్బన్): ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన చిత్తూరు జిల్లా ఇటీవల ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రితం పుత్తూరు సమీపంలో ఇద్దరు తీవ్రవాదులు చొరబడిన సంఘటన మరచిపోకముందే తాజాగా మదనపల్లెలో ఓ మావోయిస్టును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది.
ఏడాదిగా ఇక్కడే...
జార్ఖండ్‌కు చెందిన గోవిందయాదవ్ సీపీఐ ఎంఎల్ దళ జోనల్ కమిటీలో కమాండర్‌గా పనిచేశాడు. 2012-14 మధ్య కాలంలో ఇతను మావోయిస్టుగా ఉన్నాడు. ఆ సమయంలో మోరిచి మోర్ఛా సంస్థకు చెందిన వాహనానికి నిప్పంటించాడు.ఈ కేసులో గోవింద యాదవ్ ప్రధాన నిందితుడు. ఆ తరువాత జార్ఖండ్ పోలీసులకు లొంగిపోయాడు. అక్కడి న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఏడాది కాలంగా ఇతను కేసు విచారణకు హాజరుకాకపోవడంతో జార్ఖండ్‌లోని న్యాయస్థానం నిందితుడికి అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దీంతో గోవింద్‌పై జార్ఖండ్ పోలీ సులు విచారణ చేపట్టారు. ఇతను ఏడాదిగా భార్య ప్రమీళాదేవి, పిల్లలు ఆనంద్, కాజోల్‌తో కలిసి మదనపల్లెలోని పద్మావతి కల్యాణ మండపం ఎదురుగా ఓ ఇంట్లో తన బావమరిది వద్ద ఉంటున్నట్లు గుర్తించారు. మదనపల్లె పట్టణంలోని ఎస్టేట్‌లో పైపుల దుకాణంలో పనిచేస్తూ జార్ఖండ్ మావోలతో టచ్‌లో ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.
ఇతని ఫోన్ కాల్ జాబితాను పరిశీలించడంతో మావోలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారించిన జార్ఖండ్ పోలీసులు ఈ విషయంపై చిత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీ సులు మదనపల్లెలో పైపుల దుకాణంలో పనిచేస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో గోవింద యాదవ్‌ను గుర్తించి అరెస్టు చేశారు. మిగిలిన ఏడుగురిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో మన పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మదనపల్లె పట్టణంలో ఏడాదిగా తలదాచుకున్న మావోయిస్టు గోవింద్ యాదవ్‌ను గుర్తించడంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సివిల్ పోలీసులు విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మదనపల్లెలో మావో కలకలం!
Published Tue, Nov 3 2015 2:15 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement