మూడు రోజులైంది ఒకటే వాన... కాసేపు తెరిపిస్తే... గంటపాటు కుమ్మరింపు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లామొత్తం చూపిస్తోంది. నాలుగు మండలాలు మినహా అంతటా ఒక మోస్తరు వానలు కురిశాయి. వాగులు, చెరువులు నిండగా... నదులు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. జనజీవనానికి మాత్రం కాస్త ఆటంకం ఏర్పడుతోంది. వ్యవసాయానికి ఇవి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఆగకుండా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంవల్ల శనివారం భారీగానే వర్షం కురిసింది. దీని ప్రభావంవల్ల వేసవిలో ఎండిన చెరువులు, చిన్నచిన్న వాగులు కాస్త జలసిరితో కళకళలాడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం క్రమంగా బలపడి శనివారం నాటికి వాయుగుండంగా మారింది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు కూడా సహకరించడంతో అనుకున్నదాని కంటే అధికంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఖరీఫ్ సీజన్ ఈ ఏడాది అలస్యంగా వస్తుందని రైతులు భావించినా అల్పపీడనం అనుకూలించంతో రైతులు తమ పనుల్లో తలమునకలయ్యారు. జిల్లాలో ప్రధానంగా వంశధార, నాగావళి, బాహుదా తదితర నదులు నిలకడగా ఉన్నాయి. నాగావళి నదిపై శ్రీకాకుళం పాత బిడ్జి వద్ద పాదచారుల కోసం వేసిన కాజ్‌వే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. నాగావళి, వంశధారలో సాధారణంగానే నీరు ప్రవహిస్తోంది. మరో రెండు రోజులపాటు వానలు అధికంగా కురిసినట్టయితే నదిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఒడిశాలోనూ అల్పపీడన ప్రభావం ఉండటంవల్ల క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీవర్షాలు కురిసినట్టయితే జిల్లాలో నదులు పొంగవచ్చు.
సాధారణం కంటే అధికమే...
జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం కంటే 21 మండలాల్లో అధికంగానే నమోదైంది. 4 మండలాల్లోనే తక్కువగా నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 5125.9 మిల్లీ మీటర్లుకాగా ఇప్పటికే 4446 మి.మీటర్ల వర్షం పడింది. జిల్లా వ్యప్తంగా శుక్రవారం 233.8 మి.మీలు వర్షం కురవగా, శనివారం 734 మి.మీలు కురిసింది. సగటున శనివారం 19.3 మి.మీలు వాన కురిసింది. అత్యధికంగా సీతంపేటలో 32మి.మీ., లావేరులో 33.2 మిమీ, రణస్టలంలో 35, జి సిగడాంలో 34,8, గారలో 31.2, సంతబొమ్మాళిలో 30.2, వంగరలో 27.4, నరసన్నపేటలో 28, పోలాకిలో 29.8, కోటబొమ్మాళిలో 26.6, నందిగాంలో 29.2, సంతకవిటిలో 10.4, భామినిలో 7.2, హిరమండలంలో 8.4, బూర్జలో 6, సరుబుజ్జిలిలో 7.6, సోంపేటలో 10.2 మి.మీలు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో సగటున రణస్థలంలో 35మి.మీలు, జి.సిగడాంలో 34,8, లావేరులో 33.2, సీతంపేటలో 32, గారలో 31.2, సంతబొమ్మాళిలో 30.2 మి.మీలు వర్షాలు పడ్డాయి. తక్కువగా బూర్జలో 6, భామినిలో 7.2, సరుబజ్జిలిలో 7.6. హిరమండలంలో 7.8మి.మీలు కురిశాయి.
కుమ్మరించిన వాన
Published Sun, Jun 21 2015 3:37 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement